iDreamPost
android-app
ios-app

కొత్త కేడ‌ర్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?

కొత్త కేడ‌ర్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?

గ్రామం, ప‌ట్ట‌ణం, నియోజ‌క‌వ‌ర్గం.. ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా ఏపీలో తెలుగుదేశం ప్ర‌భావం దాదాపు శూన్యం. దీంతో ముఖ్య నేత‌లే కాదు.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పార్టీనే అంటిపెట్టుకున్న కార్య‌క‌ర్త‌లు కూడా జెండా దించేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు ఆ పార్టీకి రాజీనామా చేయ‌డం చూశాం.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత కార్య‌క‌ర్త‌లు కూడా రాజీనామాలు చేస్తుండ‌డం ఇప్పుడు ఏపీలో ట్రెండ్ గా మారింది. ఇటీవ‌లే తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక ముగిసిన అనంత‌రం స్థానికంగా ఆ పార్టీ చేస్తున్న రాజ‌కీయాల‌తో పాటు గెలిచే అవ‌కాశాలు ఎలాగూ లేవ‌ని గ‌మ‌నించిన పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు కార్య‌క‌ర్త‌లు తాజాగా టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నేత‌లే కాకుండా.. ఇప్పుడు కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీకి దూరం అవుతుండ‌డంతో టీడీపీ లో మిగిలిన ఉన్న వారికి ఉత్సాహం స‌న్న‌గిల్లుతోంది. దీంతో ఎలాగైనా పార్టీ బ‌తికించుకోవ‌డానికి అధినేత చంద్ర‌బాబునాయుడు వినూత్న మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.

వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో పార్టీపై అత్య‌ధికంగా దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదమని చంద్ర‌బాబు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ప‌న్నుతున్నార‌ట‌. ఓ వైపు వ‌ల‌స‌లను ఆపుకుంటూ, మ‌రోవైపు కొత్త కేడ‌ర్ ను ఎలా పెంచుకోవాల‌న్న దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. 2019 ఎన్నికల తరువాత టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అదే చంద్రబాబును భయపెడుతుంది. వైఎస్సార్ ఉన్నప్పుడు కూడా టీడీపీలోని ఉండి చాలా మంది నాయకులు పోరాడారు. జగన్ సీఎం అయ్యాక టీడీపీ వీర విధేయులు సైతం వైసీపీలోకి చేరుతున్నారు. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.

ఇప్పటి నుంచి కొత్త క్యాడర్ ను తయారు చేసుకోవాలని సిద్ధమయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ కూడా కొత్త క్యాడర్ ను తయారు చేయడంతో పాతవాళ్లంతా టీడీపీలో చేరారు. దీంతో ఉన్న వాళ్లను కాపాడుకోవాలంటే చంద్రబాబు ఇప్పుడు క్యాడర్ ను పెంచక తప్పడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా కాలం అయినందున ఎలాంటి ప్రొగ్రామ్స్ లేవు. దీంతో వాడవాడలా టీడీపీ కార్యకర్తలు సర్వే చేసి యూత్ ను ఆకట్టుకునే పని చేయాలని సూచించాడట. ఇందులో భాగంగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ సింగ్ ను వాడుకొని సోషల్ మీడియా ద్వారా యూత్ ను అట్రాక్ట్ చేస్తే పార్టీకి బలం పెరుగుతుందని అనుకుంటున్నారట. ఇలా సోషల్ మీడియా ద్వారా వైసీపీ గవర్నమెంట్ ను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టించే ఆలోచన చేస్తున్నారు. అలాగే డేటా యాప్స్ తయారు చేయించి ప్రతీ నియోజకవర్గానికో యాప్ ను ఉంచి వారికే అడ్మిన్ ఇచ్చే విధంగా రాబిన్ టీం పనిచేయాలని సూచించిన‌ట్లు తెలిసింది. తెలంగాణ‌లో సైబ‌రాబాద్ తానే నిర్మించాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు సైబ‌ర్ రూట్లో కొత్త కేడ‌ర్ ను పెంచుకునే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా..?