Idream media
Idream media
గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ ఓటమి, రాష్ట్రంలో తన విజయం ఖాయమని భావించారు. కేంద్రంలో బీజేపీని మట్టి కరిపించాలంటే కాంగ్రెస్ పార్టీకున్న బలం ఒక్కటే సరిపోదని, ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారో ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, దేశంలోని చిన్నాచితకా పార్టీలను కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిగా ఏర్పరచడానికి చంద్రబాబు చాలా కష్టపడ్డాడు.
పిలిచిన పేరంటానికి, పిలవని పేరంటానికి వెళ్లి, నాయకులందరినీ వేదిక మీదకు తీసుకొచ్చి, తాను మధ్యలో నిలబడి చేతులు పట్టుకుని ఫోటోలకి పోజులిచ్చి కార్యక్రమం అంతా తన ఆధ్వర్యంలో జరుగుతుందన్న బిల్డప్ ఇచ్చారు. మళ్ళీ దేశవ్యాప్తంగా చంద్రబాబు చక్రం తిరగడం మొదలైందని చంద్రబాబు అభిమానులు సంతోషపడ్డారు.
చంద్రబాబు షోలో ఇష్టమున్నా, లేకపోయినా ప్రధాన పాత్ర పోషించిన వారిలో మమతా బెనర్జీ ఒకరు. బెంగాల్లో జరిగిన సమావేశాల్లో “బెంగాల్ దుర్గ చేతిలో ఢిల్లీ రాక్షసుడు అంతం కావడం ఖాయం” అని చంద్రబాబు గర్జించారు కూడా. అయితే అనుకున్నదొక్కటి అయినది మరొకటి అన్నట్టు ఇక్కడ చంద్రబాబు దారుణంగా ఓడిపోతే, కేంద్రంలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత చంద్రబాబు తన రాష్ట్రానికి పరిమితమై, కరోనా రాకతో జూమ్ మీటింగులకే పరిమితమైపోయాడు.
ఎదురీదుతున్న దీదీ
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ ఈసారి గట్టి పట్టుదలతో ఉంది. కేంద్ర స్థాయి నాయకులు పదేపదే పర్యటనలు చేయడం, తృణమూల్ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలతో దీదీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. రాజకీయాల్లో కింద నుంచి పైకొచ్చి, ఎన్నో పోరాటాలు చేసి, ఢక్కాముక్కీలు తిన్న మమతా బెనర్జీ బీజేపీ ఎత్తులకి ఏమాత్రం తీసిపోకుండా పైఎత్తులు వేస్తూ తన శక్తినంతా కూడగట్టుకుని చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు సాయమందిస్తారా?
అయితే ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే బీజేపీయేతర పార్టీలకు పెద్దన్న లాగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు మమతా బెనర్జీకి అండగా నిలబడతారా లేదా అన్నది. ముస్లిం ఓట్ల కోసం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఆ వర్గంవారు ఎక్కువగా ఉన్న చోట్ల కాశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నట్టు, బెంగాల్లో కూడా ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి ఫరూక్ అబ్దుల్లాని బెంగాలుకు తీసుకెళ్తారా, ఎన్నికల వ్యూహరచనలో తన అపార అనుభవాన్ని మమతా బెనర్జీకోసం ఉపయోగించడానికి తాను స్వయంగా ఎన్నికల ముందు బెంగాల్లో తిష్ఠవేసి ఈ ఎన్నికల సమరంలో దీదీని గట్టెక్కిస్తారా అని చాలా మంది రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. కరోనా వలన తాను బయటకు రాలేకపోయినా జూమ్ లో అయినా కార్యం చక్కపెడుతారేమో చూడాలి.