iDreamPost
android-app
ios-app

Vizag steel – “ఉక్కు” పిడికిలి మ‌రింత‌గా బిగిస్తే…!

Vizag steel – “ఉక్కు” పిడికిలి మ‌రింత‌గా బిగిస్తే…!

ప్ర‌జామోదం లేని కొన్ని నిర్ణ‌యాల‌పై కేంద్రం పున‌రాలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నూత‌న‌ సాగు చ‌ట్టాలను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన‌ ప్ర‌క‌ట‌న మ‌రింత మందిలో ఆస‌క్తిని, ఆశ‌ల‌ను రేకెత్తిస్తోంది. అందులో ఏపీకీ సంబంధించి విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌. క‌రోనా అనంత‌రం కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల్లో మ‌రొక‌టి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల అమ్మ‌కం. దీనిలో భాగంగానే విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని కూడా విక్ర‌యించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు కొన్ని నెల‌లుగా పోరాడుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం త‌న మొండి ప‌ట్టు వీడ‌డం లేదు. ప‌రిశ్ర‌మ అమ్మ‌కం దిశ‌గానే ముందడుగులు వేస్తోంది.

ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఏపీ స‌ర్కారు కూడా వ్య‌తిరేకిస్తోంది. కేంద్ర తీరుకు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. వైసీపీ ఎంపీలు కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌త్య‌క్ష‌ ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌డ‌మే కాదు.. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో నిర‌స‌న స్వ‌రం వినిపిస్తున్నారు. అయితే కార్మికులు, రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఉక్కు పిడికిలి మ‌రింత బిగిస్తే విశాఖ క‌ర్మాగారం అమ్మ‌కంపై కూడా కేంద్రం పునరాలోచించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న భావ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోదీ తీరులో క‌నిపిస్తున్న మార్పే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో మోడీ సర్కారు త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ది లేదు. ల్యాండ్ ఎక్విజ‌ష‌న్ ఆర్డినెన్స్ త‌ప్పా దేనిపైనా పున‌రాలోచించ లేదు. అలాంటిది ఇప్పుడు నూత‌న సాగు చ‌ట్టాలపై వెన‌క్కి త‌గ్గింది. ఇదే అదునుగా మ‌రిన్ని డిమాండ్ లు ఊపందుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు.. వచ్చే ఏడాది జరగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందన్న అంచనాలు మోడీ సర్కారు కొన్ని నిర్ణ‌యాల‌పై ఆలోచించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వాదానికి బలం చేకూరేలా తాజాగా ప్రధాని మోడీ మూడు వివాదాస్పద రైతు చట్టాల్ని రద్దు చేస్తామని..అందుకు తగ్గట్లు సాంకేతిక చర్యల్ని చేపడతామని చెప్పటం తెలిసిందే. దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఇంతకాలం మోడీ తీరుతో విసిగిపోయిన ఉద్యమకారులకు కొత్త బలాన్ని.. అంతకు మించిన స్థైర్యాన్ని ఇస్తుందని చెప్పాలి.

ముందడుగు మాత్రమే తప్పించి.. వెనకడుగు వేసేదే లేదన్నట్లుగా వ్యవహరించే మోడీ సర్కారులో వచ్చిన మార్పు నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు తమ హక్కుల సాధనకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు విషయంలోనూ కేంద్రం తీరును వేలెత్తి చూపిస్తూ ఉద్యమాన్ని మ‌రింత ఉధృతంగా నిర్వహిస్తే ఫలితం ఉండే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.