తలైవర్ రజినీకాంత్ ని గవర్నర్ పదవి వరించబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా కాలం ఊరించి అభిమానులను ఉస్సురనిపించిన సూపర్ స్టార్ మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ ని తమ పార్టీలో చేర్చుకోవాలని ఉవ్విళ్ళూరిన బీజేపీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదని వివరణ ఇచ్చిన రజనీ ఈసారి బీజేపీ ఆఫర్ ని సీరియస్ గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే రజనీకాంత్ ఏదొక రాష్ట్రానికి గవర్నర్ గా తేలవచ్చు.
పది రోజుల క్రితం రజనీ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవితో భేటీ అవడంతో రెండేళ్ళ తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మళ్ళీ చర్చ మొదలైంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని తలైవర్ ఆరోజే తేల్చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించింది నిజమేనన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేది మాత్రం లేదని తెగేసి చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీ జైలర్ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళారని చెబుతున్నా అక్కడాయన బీజేపీ అగ్ర నేతలను కలిసినట్లు సమాచారం.
రజనీ మాట ఎలా ఉన్నా బీజేపీ మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి లాగడానికే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక మినహా దక్షిణాదిలో పెద్దగా పట్టు లేని కాషాయ పార్టీ కొంత కాలంగా ఇక్కడ పాగా వేసే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. తెలంగాణలో కాస్తో కూస్తో ఆశ కనపడుతున్నా తమిళనాడులో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అందుకే తమిళులను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ నానా తంటాలూ పడుతోంది. ఇళయరాజాకు రాజ్యసభ సీటు అందులో భాగమేనని కొందరు చెబుతారు. ఇప్పుడు రజనీకాంత్ ని తమ పార్టీలో చేర్చుకుంటే ఆయన అభిమానుల్ని తమవైపు తిప్పుకోవచ్చన్నది పార్టీ వ్యూహం. సహజంగానే ఆధ్యాత్మిక చింతన కలిగిన రజనీ ద్వారా హిందూత్వ అజెండాను ప్రచారం చేసి ఇక్కడ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేలా కమలం నేతలు చక్రం తిప్పుతున్నారు. దీనికి గవర్నర్ పదవినే మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.