iDreamPost
iDreamPost
2019లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాగైనా 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల్లో ప్రధాన భాగం జనసేన మరియు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. ఎలా చూసుకున్నా 2024 ఎన్నికలు చంద్రబాబుకు చాలా కీలకం అని చెప్పక తప్పదు.
వయసు రీత్యా ఆయన 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఆ తర్వాత 2029 ఎన్నికల్లో పోటీకి లేదా పార్టీని నడిపించేందుకు ఆయన వయసు సహకరించక పోవచ్చు. అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటో తన కొడుకు లోకేష్ భవిష్యత్తు ఏమిటో చెప్పలేం. అందువల్లే 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మొదటి రెండేళ్ళు తాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఆ తర్వాత లోకేష్ ను ఆ పదవిలో కూర్చోబెట్టి కొడుకు రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేయాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే ఇందుకు పార్టీ గెలుపు ముఖ్యం.
ఎన్టీఆర్ నుండి టీడీపీ పగ్గాలు చంద్రబాబు తీసుకున్నప్పటి నుండి ఏ పార్టీతో పొత్తులేకుండా ఆయన ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తుపెట్టుకున్న ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు ఆయన నేతృత్వంలోని టీడీపీ విజయం సాధించాయి. కమ్యూనిస్టులు, తెరాస తో పొత్తు పెట్టుకున్నా మహా కూటమిగా ఏర్పడినా 2009 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించలేదు. అందువల్ల 2024 ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు తప్పవని, అదికూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆమేరకు పావులు కదుపుతూనే ఉన్నారు.
Also Read : Chandrababu Naidu – Kuppam – బాబుగారూ ఇంత రాజకీయం చేస్తూ ఇదేం విడ్డూరం!
ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను తనవైపు తిప్పుకోవడంలో కొంతమేర చంద్రబాబు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుంది అనే సంకేతాలు రెండు పార్టీల శ్రేణులకు అందాయి. ఆమేరకు జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అనుకూల సంకేతాలే ఇస్తున్నారు. రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పార్టీల మధ్య పొత్తుపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో అయితే ఇప్పటికే రెండు పార్టీల నాయకులూ, కార్యకర్తలు పొత్తులోకి వెళ్ళిపోయారు..
నిన్న మొన్న జరిగిన గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఈ రెండుపార్టీల మధ్య పొత్తు బహిరంగంగానే కనిపించింది. ఏ ప్రాంతంలో ఏ పార్టీ అభ్యర్థులు బలంగా ఉంటే రెండు పార్టీల నేతలూ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన నాయకులు చాలా చోట్ల కలిసి పనిచేస్తూనే ఉన్నారు. అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేన నేతలు మాత్రం టీడీపీతో జట్టుకట్టి పనిచేస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు దృష్టి అంతా ఇప్పుడు బీజేపీతో పొత్తువైపే ఉంది. ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల బరిలోకి దిగాలని చంద్రబాబు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు టీడీపీ, జనసేన కలిసి బీజేపీ మద్దతుతో అసెంబ్లీకి పోటీ చేసి, పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలకు బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని చంద్రబాబు వ్యూహం రచించారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి సంకేతాలు పంపించారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలు బీజేపీకి వదిలివేయాలని, ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు మూడుపార్టీలు కృషి చేయాలనీ చంద్రబాబు వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
అసెంబ్లీ స్థానాలు టీడీపీ, జనసేన పోటీ చేసి పార్లమెంటు స్థానాలు తమకు వదిలేస్తే బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందిస్తుందని చంద్రబాబు వ్యూహం. అయితే పార్లమెంటు స్థానాలు కేటాయించడమే కాదు వాటిలో గెలుపు బాధ్యత కూడా చంద్రబాబే తీసుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసి బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపారు. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీటీ పొత్తు ఉండబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోదర్ నిర్ద్వందంగా ప్రకటించారు. అయినా చంద్రబాబు తన ప్రయత్నాలు విరమించుకునేలా కనిపించడం లేదు. బీజేపీలోని తనకు అనుకూల నేతల ద్వారా పార్టీ అధినాయకత్వంతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏవైనా ఓ రూపం తీసుకోవాలంటే 2023 వరకూ వేచి చూడాల్సిందే.
Also Read : Chandrababu Naidu – Diwali : బాబు ‘హిందూ’ ప్రేమ.. బీజేపీని ఆకర్షించడానికా?