iDreamPost
android-app
ios-app

బెంగుళూరు మోడల్ సినిమా టికెటింగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా

  • Published Sep 30, 2021 | 8:02 AM Updated Updated Sep 30, 2021 | 8:02 AM
బెంగుళూరు మోడల్ సినిమా టికెటింగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అమలులో ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ తెలంగాణలో రాబోతోందా అంటే ఆల్రెడీ వచ్చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సినిమాను బట్టి దానికున్న డిమాండ్ ని బట్టి లేదా పెట్టిన బడ్జెట్ కి తగట్టుగా ఎప్పటికప్పుడు ముఖ్యంగా వీకెండ్ లో టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటునే ఫ్లెక్సీ ప్రైసింగ్ అంటారు. చిన్న సినిమాలకు రెగ్యులర్ కంటే తక్కువ ధరలను కూడా ఆఫర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అడుగులు వేగంగా పడుతున్నాయని తెలిసింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి సిటీస్ లో శనిఆదివారాలు మల్టీ ప్లెక్సుకు వెళ్లాలంటే దాదాపు రెట్టింపు ఖర్చు పెట్టాల్సిందే. ఇదంతా అఫీషియల్.

రేపు విడుదల కాబోతున్న సాయి తేజ్ రిపబ్లిక్ కు దీన్ని అప్లై చేసినట్టు కనిపిస్తోంది. సాధారణంగా 138 రూపాయల టికెట్ ధర ఉండే ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇప్పుడు దాని స్థానంలో 200 రూపాయలు చూపిస్తోంది. అంటే 62 రూపాయలు ఎక్కువన్న మాట. సింగల్ స్క్రీన్లలోనూ 150 దాకా పెంచేశారు. కొన్ని చోట్ల మాత్రం పాత రేట్లే ఉంచేశారు. ఇదంతా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ కు మధ్య ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి కాబట్టే రిపబ్లిక్ కి ఇది చేశారని అంటున్నారు. మాములుగా సంక్రాంతి సీజన్ లోనే ఇలాంటివి వర్కౌట్ అవుతాయి కానీ సెప్టెంబర్ లాంటి డ్రై పీరియడ్ లో ఇదంతా ఒకరకంగా ప్రయోగమనే చెప్పాలి.

మరోపక్క ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి రాబోతోంది. అయితే ఇలాంటి ఫ్లెక్సీ కాన్సెప్ట్ రాకపోవచ్చు కానీ పెద్ద సినిమాలకు వెసులుబాటు వచ్చేలా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ బాగా ఖరీదయిన తరుణంలో హైదరాబాద్ లాంటి చోట్ల ఇలా వారాంతంలో ధరలు పెంచుకుంటూ పోతే ఏ మేరకు ఫలితాలను ఇస్తుందన్నది కొంత కాలం ఆగాక క్లారిటీ వస్తుంది. బాహుబలి,ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి వాటికి పబ్లిక్ ఎంతైనా పెద్దగా లెక్క చేయరు కానీ మీడియం రేంజ్ వాటికి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు. మరి ఇలాంటి కాన్సెప్ట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Also Read : ఆట తీరు మార్చకపోతే కష్టం గురూ