iDreamPost
android-app
ios-app

కెప్టెన్ వాడేకర్ గవాస్కర్ ను బాత్రూమ్ లో ఎందుకు దాచిపెట్టాడు?

కెప్టెన్ వాడేకర్ గవాస్కర్ ను బాత్రూమ్ లో ఎందుకు దాచిపెట్టాడు?

సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం 1971 ఫిబ్రవరి – ఏప్రిల్ మధ్య వెస్టిండీస్ లో పర్యటించిన భారత జట్టు ఆ జట్టు మీద తన మొదటి టెస్టు మరియు సిరీస్ విజయాలను నమోదు చేసింది. ఈ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తను ఆడిన నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.

వేలు ఇన్ ఫెక్షన్ కారణంగా మొదటి మ్యాచ్ ఆడలేకపోయిన గవాస్కర్, రెండవ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో రెండు హాఫ్ సెంచరీలు సాధించి, జట్టు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచుల్లో మూడు సెంచరీలు ఒక డబుల్ సెంచరీ సాధించి తన ప్రతిభను చాటాడు.

గవాస్కర్ ని తాకితే అదృష్టం

రెండవ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న గవాస్కర్ ఇచ్చిన తేలికైన క్యాచ్ ను వెస్టిండీస్ కెప్టెన్ గారీ సోబర్స్ జారవిడిచాడు. ఆ ఇన్నింగ్స్ లో గవాస్కర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా గవాస్కర్ ఇచ్చిన తేలికైన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న సోబర్స్ జారవిడిచాడు. ఆ ఇన్నింగ్స్ లో గవాస్కర్ సెంచరీ సాధించాడు.

దాంతో గవాస్కర్ అదృష్టవంతుడు అని సోబర్స్ కి నమ్మకం కుదిరింది. నాలుగో టెస్టు మొదటి రోజు భారత ఆటగాళ్ల డ్రస్సింగ్ రూమ్ లోకి వచ్చి సోబర్స్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి, గవాస్కర్ ని మాత్రం భుజం మీద తట్టి, “నిన్ను తాకాను కాబట్టి నీ అదృష్టం కొంత నాకు కూడా పడుతుంది” అని నవ్వి వెళ్లి పోయాడు. ఆ మ్యాచ్ లో సోబర్స్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.

నాలుగవ మ్యాచ్ లో కూడా ప్రతిరోజూ ఉదయం భారత్ డ్రస్సింగ్ రూమ్ కి వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి గవాస్కర్ భుజం తట్టి వెళ్ళేవాడు గ్యారీ సోబర్స్. నాలుగవ మ్యాచ్ లో కూడా సెంచరీ సాధించాడు కానీ మ్యాచ్ డ్రా అయింది. అయిదవ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని వెస్టిండీస్, విజయంతో కానీ డ్రాతో కానీ మ్యాచ్ ముగించి మొదటిసారి వెస్టిండీస్ మీద సిరీస్ విజయం నమోదు చేయాలని ఇండియా ఆ సిరీస్ లో రెండవ మ్యాచ్ లో విజయం సాధించిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కి చివరి మ్యాచ్ ఆడడానికి సిద్ధం అయ్యాయి.

ఇక్కడ కూడా గవాస్కర్ సెంటిమెంట్ పని చేసి మొదటి ఇన్నింగ్స్ లో సోబర్స్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ నాలుగో రోజు రోజు సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచి, అయిదవ రోజు ఉదయం తన ఇన్నింగ్స్ కొనసాగించడానికి ప్యాడ్స్ కట్టుకోవడానికి గవాస్కర్ సిద్ధం అవుతుండగా సోబర్స్ రావడాన్ని గమనించిన కెప్టెన్ అజిత్ వాడేకర్ గబగబా చేతిలో ప్యాడ్స్ తో సహా అతన్ని బాత్రూమ్ లోకి నెట్టి తలుపు మూసేశాడు. సోబర్స్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి గవాస్కర్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఫీల్డింగ్ కోసం తన జట్టుని మైదానంలోకి నడిపించవలసిన టైమ్ కావడంతో అసంతృప్తిగా వెళ్ళిపోయాడు సోబర్స్.

అప్పుడు బాత్రూమ్ తలుపు తెరిచాడు వాడేకర్. లోపలే కాళ్ళకు ప్యాడ్స్ కట్టుకుని బయటకు వచ్చిన గవాస్కర్ “ఏమిటి సార్ ఆయన పిచ్చి నమ్మకం, మీ చాదస్తం? గ్రౌండ్లోకి పోతున్నప్పుడు నన్ను టచ్ చేయకుండా ఆపగలరా?” అన్నాడు విసుగ్గా. బొంబాయి రంజీ జట్టులో గవాస్కర్ సభ్యుడు, వాడేకర్ కెప్టెన్. కాబట్టి గవాస్కర్ కి వాడేకర్ దగ్గర చనువు ఎక్కువ. “గ్రౌండ్ లో తాకితే అదృష్టం దొరకదు. మన డ్రస్సింగ్ రూమ్ లో అయితేనే దొరుకుతుంది. నీకు తెలియదులే. నువ్వెళ్ళి డబుల్ సెంచరీ మీద దృష్టి పెట్టు” అన్నాడు వాడేకర్.

అన్నట్లు గానే గవాస్కర్ ఆ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. తర్వాత కాసేపటికి ఇండియా ఆలౌట్ కావడంతో రెండున్నర సెషన్స్ లో 261 పరుగులు విజయ లక్ష్యంతో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. విజయం కోసం ధాటిగా బ్యాటింగ్ మొదలు పెట్టినా వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి తృటిలో ఓటమి తప్పించుకుంది.

వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయాక సోబర్స్ బ్యాటింగ్ కి దిగుతుండగా డ్రస్సింగ్ రూమ్ నుంచి పిచ్ దగ్గరకు వచ్చే దారికి సమీపంలో గవాస్కర్ లేకుండా అవతలి వైపు ఫీల్డింగ్ పొజిషన్లో నిల్చోబెట్టాడు వాడేకర్. ఆ ఇన్నింగ్స్ లో సోబర్స్ ఖాతా తెరవకుండా డకౌట్ అయ్యాడు. వికెట్ పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆటగాళ్లు అందరూ మైదానం మధ్యకి చేరుకున్నప్పుడు “నాది పిచ్చి నమ్మకం అని కొట్టి పడేశావుగా. ఇప్పుడు చూడు ఏమైందో” అని నవ్వేశాడు వాడేకర్.

అరివీర భయంకర వెస్టిండీస్ జట్టు మీద సిరీస్ విజయం సాధించిన స్ఫూర్తితో ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఇంగ్లాండులో ఇంగ్లాండు మీద సిరీస్ విజయం సాధించింది భారత జట్టు. ఆరంగేట్రంలోనే అదరగొట్టిన సునీల్ గవాస్కర్ ఒక్కోమెట్టు ఎక్కుతూ అనేక రికార్డులు సృష్టించి ప్రపంచ క్రికెట్ లోనే ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్ లో ఒకరుగా పేరు తెచ్చుకున్నాడు.