iDreamPost
android-app
ios-app

లోకేష్ ఉండగా రామయ్యే ఎందుకు బాబు ?

  • Published Mar 13, 2020 | 10:31 AM Updated Updated Mar 13, 2020 | 10:31 AM
లోకేష్ ఉండగా రామయ్యే ఎందుకు బాబు ?

రాజకీయాల్లో అవసరానికి వ్యక్తులని ఉపయోగించుకోవడం, అవసరం తీరిపొయాక అదే వ్యక్తులని పక్కన పెట్టడం తరుచూ చూస్తు ఉంటాము. తెలుగుదేశం అధినేత చంద్రబాబులో మాత్రం ఈ ధోరణి కాస్త అధికంగా ఉందనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు కీర్తిశేషులు హరికృష్ణ దగ్గరనుండి మోత్కుపల్లి నరసింహులు దాక చంద్రబాబు తమని అవసరానికి ఉపయోగించుకొని పక్కన పెట్టారు అని చెప్పిన వ్యక్తులే. ఈ మాటలను మరోసారి రుజువు చేస్తూ రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో గెలిచేంత సంఖ్యా బలం లేకపొయినా వర్ల రామయ్య చేత నామినేషన్ వేయించి తన రాజకీయ అవసరాలకు మరోసారి తెరలేపారు చంద్రబాబు.

నిజానికి వర్ల రామయ్య 2018లో రాజ్యసభ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. ఆనాడు తెలుగుదేశానికి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అందులో ఒక స్థానం పార్టీకి ఆర్ధికంగా అండగా నిలబడ్డ సీఎం రమేశ్‌కు ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పిన చంద్రబాబు చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. చివరి నిమిషం వరకూ వర్ల రామయ్యకే ఇస్తారని అందరూ భావించినా, చంద్రబాబు వేరే నిర్ణయం తీసుకోవడంతో వర్ల ఆనాడు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోడానికి అవసరమైన 41 మంది శాసన సభ్యుల బలం తెలుగుదేశానికి లేనప్పటికి వర్ల రామయ్యను చంద్రబాబు రంగంలోకి దించడంతో మరోసారి రామయ్యను చంద్రబాబు తనరాజకీయ అవసరాలకు వాడుకోబోతున్నాడా అనే మాట తెలుగుదేశం నేతల నుండే వినపడుతోంది.

సంఖ్యాపరంగా చూసుకుంటే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం లాంఛనమే అయినప్పటికి వర్ల రామయ్యను బరిలోకి దింపడం వెనక చంద్రబాబు రాజకీయంగా ప్రత్యేక వ్యూహం ఉందనే మాట వినిపిస్తింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటి పెట్టడం ద్వారా తెలుగుదేశం తరుపున గెలిచిన శాసన సభ్యులందరికి విప్ జారీ చేసి, పార్టీ ఏజెంటుకు చూపించి ఓటు వేసేలా ప్రణాళిక రూపొందించి, విప్ ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేయవచ్చనే ఆలోచనతో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉంటు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్ లాంటి వారిపై చర్యలు తీసుకోవ్చనే వ్యుహం తోనే వర్ల రామయ్యను పావుగా వాడుతున్నట్లు తెలుస్తుంది.

చంద్రబాబు రాజకీయ ఆలోచన ఎలా ఉన్న వర్ల రామయ్య లాంటి సీనియర్ నేతకు గతంలో రాజ్యసభకు ఎంపిక చేస్తాం అని చెప్పి చేయకపొగా ఇప్పుడు గెలిచే అవకాశం లేకపోయినా రాజ్యసభ పేరుతో అదే వర్ల రామయ్యని వాడుకోవడం చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన రాజకీయం అని ఆ పార్టీలోని దళిత నేతలు విమర్శిస్తున్నారు. తన రాజకీయ అవసరాలకు ఒక దళిత వ్యక్తిని అడ్డుపెట్టుకోక పోతే ఇదే ఓడిపొయే స్థానం తన కొడుకు లోకేష్ ఇచ్చి.. ఇదే రాజకీయం ఎందుకు చంద్రబాబు చేయడం లేదు? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఓటమి మచ్చ కొడుకు లోకేష్ పై పడకుండా ఆ మచ్చ దళితులపై వేస్తారా అనే ప్రశ్న దళిత సంఘాల నుండి వినిపిస్తుంది. ఏది ఏమైనా లోకేష్ ఉండగా రామయ్య ఎందుకు బాబు అని అధికార పక్షం, దళిత సంఘాలు వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.