iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లోనే కీలక నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. రాజకీయంగా కృష్ణా జిల్లా వాసులనే కాకుండా రాష్ట్ర ప్రజలందరి దృష్టిని అక్కడి వ్యవహారాలు ఆకర్షిస్తాయి. పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ప్రాతినిధ్యం ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ హవా సాగుతోంది. ఆయన వరుస విజయాలు సాధించారు. కానీ కొన్ని నెలల క్రితం సొంత పార్టీకి హ్యాండిచ్చారు. జగన్ కి జై కొట్టారు. అదే సమయంలో జగన్ తనకు తానుగా నిర్దేశించుకున్న విలువల ప్రకారం వంశీ మెడలో కండువా కప్పడానికి మాత్రం సిద్ధపడలేదు. దాంతో వంశీ టీడీపీని వీడినా వైఎస్సార్సీపీలో అధికారికంగా సభ్యుడు కావడం సాధ్యం కావడం లేదు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటుని చెల్లని ఓటుగా మార్చి టీడీపీకి ఝలక్ ఇచ్చిన ముగ్గురిలో వంశీ ఒకరు. ఇంకా చెప్పాలంటే ఏపీలో టీడీపీకి షాక్ ఇచ్చి జగన్ గూటిలో అడుగుపెట్టిన మొదటి ఎమ్మెల్యే కూడా వంశీనే. అదే సమయంలో చంద్రబాబు మీద, టీడీపీ భవితవ్యం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం వైఎస్సార్సీపీలో కూడా వంశీకి అనుకూలంగా మలుమార్పులు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావుకి డీసీసీబీ అప్పగించి, ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా నుంచి తప్పించారు. ఆ తర్వాత దుట్టా రామచంద్రరావు కుటుంబానికి జిల్లా పరిషత్ లో కీలక పదవి కట్టబెట్టడానికి అంతా సిద్ధం చేశారు. స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే దుట్టా వారసురాలు జెడ్పీలో ఇప్పటికే ప్రధాన పాత్రలో కనిపించేవారు.
ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలకు వివిధ ప్రాధాన్యత కలిగిన పదవులను ఇచ్చి గన్నవరం రాజకీయాల్లో వంశీకి లైన్ క్లియర్ చేసే పనిలో పార్టీ అధిష్టానం ఉంది. కానీ స్థానిక నాయకత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. సుదీర్ఘకాలంగా వంశీతో ఉన్న వైరం రీత్యా అనేక చోట్ల వివాదాలు తప్పడం లేదు. యార్లగడ్డ అనుచరులు ఆచితూచి వ్యవహరిస్తుంటే దుట్టా వర్గం మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. నేరుగా వంశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వంశీ మరో ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం మొదలయ్యింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఉప ఎన్నికలకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు గన్నవరంలో ప్రచారం సాగుతోంది.
వంశీ తర్వాత గన్నవరంలో ఇన్ఛార్జ్ ని కూడా నియమించలేని స్థితిలో టీడీపీ ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్సార్సీపీ నేతగా బరిలో దిగితే తనకు అంతా సానుకూలంగా ఉంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అటు వైసీపీలో తన వ్యతిరేకులను ఇటు టిడిపి నాయకులకు ఒకే సారి చెక్ పెట్టి జగన్ పార్టీ ఎమ్మెల్యేగా జెండా ఎగురవేసే అవకాశం ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ దానికి ముఖ్యమంత్రి సిద్ధపడతారా, ఇప్పుడే ఉప ఎన్నికలకు అవకాశం ఇస్తారా అన్నది వంశీకి కూడా స్పష్టత లేదనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో ముదురుతున్న రాజకీయాలు ఎటు మళ్లుతాయన్నది ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నట్టు చెప్పవచ్చు.