iDreamPost
android-app
ios-app

కేశ‌వ్.. కేశ‌వ్‌.. : ప‌ల‌క‌డం లేదెందుకు..?

కేశ‌వ్.. కేశ‌వ్‌.. : ప‌ల‌క‌డం లేదెందుకు..?

‘పయ్యావుల కేశవ్’ అనంతపురం జిల్లా ఉరవకొండ తెలుగుదేశం శాసనసభ సభ్యుడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో ఈయ‌న ఒక‌రు. 2019లో వైసీపీ హోరు గాలిలో కూడా ఈయన 4000 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మంచి వ‌క్త‌గా రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు పేరుంది. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న పేరు వినిపించ‌డం లేదు. వార్త‌ల్లో క‌నిపించ‌డం లేదు. క‌ష్టాలు ఎదుర్కొంటున్న పార్టీకి ఆయ‌న ఎందుకు దూరంగా ఉంటున్నారు..? ఎందుకిలా? ఏం జరిగి వుంటుంది? అనే సందేహాలు చాలా మందిలో వ్య‌క్తం అవుతున్నాయి.

చంద్ర‌బాబు అప్పుడు అలా చేసినందుకేనా..?

రాజ‌కీయ అంశాల‌పై గ‌ట్టిగా మాట్లాడ‌గ‌లిగే వ్య‌క్తి పయ్యావుల కేశవ్. తెలుగుదేశం పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందు గట్టిగా నిలబడగల మాటకారి. అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ కి అవసరమైన సమయంలో మౌనంగా వుండిపోయారు? కారణం ఏమై వుంటుంది? రాజకీయాల్లో అవసరానికి ఆదుకున్నవారికే అవసరం అయినపుడు హ్యాండ్ ఇస్తారు. అలాంటిది అవసరం అయిన వేళ ఆదుకోకుంటే, అవతలి వాళ్లకు అవసరం అయినపుడు ఇలాగే మౌనం వహిస్తారు. విషయం ఏమిటంటే, పయ్యావుల కేశవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నిజానికి చంద్రబాబు తలుచుకుని వుంటే, పయ్యావులను ఎమ్మెల్సీ చేసి, ఆపై మంత్రిని కూడా చేసి వుండేవారు. కానీ అలా జరగలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నారు. పయ్యావుల ఎమ్మెల్యేగా వున్నారు.

నిజానికి చంద్రబాబు తరపున గట్టిగా మాట్లాడేవారే కరువయ్యారు. ఇలాంటి టైమ్ లో పయ్యావుల పెద్ద అండగా ఉండాల్సిన పరిస్థితి. కానీ అలా జరగడం లేదు. గత అయిదేళ్లలో చంద్రబాబు కాస్తయినా పట్టించుకుని వుంటే, ఇప్పుడు పయ్యావుల మైకు ముందుకు వచ్చి వుండేవార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కనీసం లోకేష్ అనంత పర్యటనలో గెలిచిన పయ్యావుల ప్రాధాన్యత ఇవ్వకుండా ఓటమిపాలైన పరిటాల కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటం పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో తనకి సరైనా ప్రాధాన్యత లేకపోవడం పైగా ప్ర‌భుత్వ చేస్తున్న నిర్ణ‌యాల‌న్నీ స‌రైన‌వేన‌ని భావించి పయ్యావుల సైలెంట్ గా ఉంటున్నారా..? అని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.