మంచు గ్రహాలుగా పిలవబడే యురేనస్, నెప్ట్యూన్ లు దాదాపుగా ఒకే రకమైన పరిస్థితులు కలిగి ఉంటాయి. అందుకే వాటిని కవలల్లా పోలుస్తారు శాస్త్రవేత్తలు. ఇన్ని పోలికలు ఉన్నప్పటికీ వీటి రంగులు మాత్రం వేరుగా ఉంటాయి. ఇందుకు గల కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ విషయాన్ని తెలుసుకునేందుకు హబుల్ స్పేస్ టెలిస్కోప్, జెమినీ నార్త్ టెలిస్కోప్, నాసా ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ లను ఉపయోగించారు. ఇందులో యురేనస్ వాతవరణంలో అదనపు పొగమంచు ఏర్పడుతోందని తేలింది. అందుకే నెప్యూన్ కంటే తేలికపాటి రంగులో ఉందని వివరించారు.
వాస్తవానికి, వాటి వాతావరణంలో మీథేన్ వాయువు అధిక సాంద్రత కలిగిన కారణంగా రెండూ నీలం రంగులో ఉంటాయి. మసకగా ఉండే కణాలతో తయారైన యురేనస్ వాతావరణం మధ్య పొర నెప్ట్యూన్ కంటే రెట్టింపు మందంగా ఉంటుంది.
అలా రెండు మంచు ప్రపంచాల వాతావరణంలో పొగమంచు లేకపోతే, రెండూ దాదాపు సమానంగా నీలం రంగులో కనిపిస్తాయట. అందుకే నెప్ట్యూన్ శక్తివంతమైన లోతైన నీలం రంగులో, యురేనస్ లేత నీలం రంగులో, ఆకుపచ్చ రంగులో ఉంటుందని తేల్చారు.
ఈ రెండు గ్రహాలు భూమికి నాలుగు రెట్లు, దాని ద్రవ్యరాశికి 15 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. రెండూ 17 గంటల కంటే కొంచెం తక్కువగా రోజువారీ భ్రమణాలను కలిగి ఉంటాయి.