iDreamPost
android-app
ios-app

పక్షి కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనిపెట్టిన వారికి సర్కారు కొలువు!

  • Author singhj Published - 08:10 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 08:10 PM, Mon - 7 August 23
పక్షి కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనిపెట్టిన వారికి సర్కారు కొలువు!

గ్లోబల్ వార్మింగ్ సమస్య ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతోంది. దీని కారణంగా భూమి సలసలా కాగుతోంది. కర్బన ఉద్గారాల వల్ల ఏటికేడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దీని దుష్ప్రభావాలను మనుషులందరూ అనుభవిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మానవుడు అంతరించే దశకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు. భూమిపై జీవులు బతకడం కష్టమైపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు, పక్షులు అంతరించిపోయాయి.

జంతుజాలం అంతరించిపోవడానికి వాతావరణ మార్పులతో పాటు కొందరు మనుషుల వేట, స్వార్థం కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. తాము తప్ప ఎవ్వరూ భూమ్మీద ఉండొద్దనే విధంగా ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా చదును చేసేస్తున్నారు. చెరువులను ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. అడవులు, కొండగుట్టల్ని ఆక్రమించేస్తున్నారు. దీంతో భూమిపై మిగిలిన జంతువులకు ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆహారం కోసం అనేక జంతువులు రోడ్ల మీదకు, జనావాసాల్లోకి, పొలాల్లోకి వస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం. అంతరించిపోతున్న జంతుజాలం, పక్షులను కాపాడేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు.

ప్రభుత్వాలకు తోడుగా ప్రజలు కూడా సహకరించి ఉమ్మడిగా కృషి చేస్తేనే జంతుజాలాన్ని కాపాడుకోగలం. ఇదిలా ఉంటే.. కలివి కోడి గురించి వినే ఉంటారు. ఇదో అరుదైన పక్షి జాతికి చెందినది. ఇది అంతరించిపోయిందని 1948లోనే సైంటిస్టులు నిర్థారించారు. అయితే 1986లో ఉమ్మడి ఏపీలోని కడప జిల్లా సిద్దవటం, బద్వేలు ప్రాంతాల్లో ఉన్న లంకమల అడవిలో ఒక వ్యక్తికి ఈ పక్షి కనిపించింది. కానీ అధికారులు వచ్చి పరిశీలించేలోపు అది చనిపోయింది. దాని ఉనికి తెలియడంతో ఆ జాతి పక్షులను వెతికేందుకు అప్పట్లో కేంద్ర సర్కారు రూ.కోట్లు ఖర్చు చేసిందట. ఈ పక్షిని గుర్తించిన వారికి అటవీ శాఖలో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చింది. ఆ పక్షి మళ్లీ కనిపిస్తుందేమోనని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాటి జాడ తెలుసుకునేందుకు ఆ ఆడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గమనార్హం.