iDreamPost
android-app
ios-app

ఇదెక్కడి వితండవాదం తులసిరెడ్డి?

  • Published Feb 20, 2022 | 7:43 AM Updated Updated Feb 20, 2022 | 7:43 AM
ఇదెక్కడి వితండవాదం తులసిరెడ్డి?

ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఉచితవిద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే ఈ నిర్ణయమని తులసిరెడ్డి చేస్తున్నది వితండవాదమని కొట్టిపారేస్తున్నారు. ఆదివారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం, రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడం ఒకటే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.

మీదీ టీడీపీ బాటేనా?

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మొదలు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికే అని ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవే ఆరోపణలు వల్లించి తమదీ టీడీపీలా అవాస్తవాలను ప్రచారం చేసే పార్టీ అని నిరూపించదలచుకుందా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇవ్వగానే అది ఆచరణ సాధ్యంకాదని టీడీపీ ప్రచారం చేసింది. ఇక విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిది కూడా. కానీ రాజశేేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి చిత్తశుద్ధితో ఆ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును సక్రమంగా అందించేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది.

విద్యుత్ ఉత్పత్తి, పంపిణీల మధ్య సమన్వయం సాధించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఎంత విద్యుత్ వినియోగం అవుతోంది? ఏ సమయంలో ఎక్కువ వినియోగిస్తున్నారు? వంటి వివరాలు తెలుసుకోవడానికి మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆ వివరాల అధారంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ పంపిణీలో సమన్వయం సాధించడానికి వీలవుతుంది. తద్వారా అంతరాయం లేకుండా తొమ్మిదిగంటల పాటు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేతప్ప వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను ఆపే ఉద్దేశంలేదని ప్రభుత్వం చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. అయినా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దానికి తులసిరెడ్డి వంతపాడడం శోచనీయమని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

వైఎస్సార్ పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ మానస పథకం. 2004 మే 14 న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అని చెబుతున్న తులసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును ఎందుకు చెప్పలేక పోతున్నారు అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు ప్రతిపక్షం లో ఉండి జనానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలనుకోవడమే కాక ఆ పథకంపై సాగుతున్న దుష్ప్రచారానికి దరువు వేయడం ద్వారా తులసిరెడ్డి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.

Also Read : మీ పోరాటాలు ఢిల్లీలో చేస్తే బెటర్ సోము..