iDreamPost
iDreamPost
మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నేత తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి జరగడం సంచలనంగా మారింది. అది కూడా ఆయన సొంత నియోజకవర్గంలో జరగడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలు మారినా గట్టి పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న త్రిమూర్తులకు కార్యకర్తల సమక్షంలోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం విశేషంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి, రామచంద్రాపురం ఎమ్మెల్యే సీహెచ్ వేణుతో కలిసి కారు దిగుతున్న సమయంలో జరిగిన ఈ దాడి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తోట త్రిమూర్తులు తొలి నుంచీ వివాదాస్పద నేతగా ఉన్నారు. ఆయన తొలిసారిగా 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వ్యవహారంలో పెద్ద మార్పు కనిపించింది. అడ్డూఅదుపు లేకుండా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. అందుకు అనుగుణంగానే 1996లో ఆయన స్వగ్రామం వెంకటాయపాలెంలో జరిగిన చిన్న ఘటనను సాకుగా తీసుకుని దళిత యువకులకు శిరోముండనం చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఘటన వెలుగులోకి రాగానే రాష్ట్రమంతా ఆందోళనలు మిన్నంటాయి. దాంతో చివరకు ఆనాటికి ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది. అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్ కి తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్ట్ ఏర్పాటయ్యింది.
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక పోరు హోరాహోరుగా ఉంటుంది. కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో నేటికీ సాగుతోంది. కాపు కులానికి తోట త్రిమూర్తులు కీలకనేతగా ఉంటే, శెట్టిబలిజ కులానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ నాయకుడిగా చాలాకాలం పాటు వ్యవహరించారు. ఇరువురు మధ్య 1994 నుంచి 2014 వరకూ వరుసగా ఆరు ఎన్నికల్లో ముఖాముఖీ పోరు సాగింది. అందులో నాలుగు సార్లు త్రిమూర్తులు విజయం సాధించగా, రెండు సార్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ ది పై చేయి అయ్యింది. చివరకు మొన్నటి ఎన్నికల్లో బోస్ స్థానంలో రామచంద్రాపురం నుంచి శెట్టిబలిజ కులానికే చెందిన చెల్లుబోయిన వేణుని వైఎస్సార్సీపీ రంగంలో దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులపై పక్క వలస వచ్చిన నేత అయినప్పటికీ వేణు విజయం సాధించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్న తోట త్రిమూర్తులు నాటి నుంచి కేసు విచారణ పూర్తికాకుండా అడ్డుకున్నారనే విమర్శలున్నాయి. టీడీపీ పాలనా కాలంలో బాధితులకు ఎస్సీ సర్టిఫికెట్లు కూడా రాకుండా చేశారంటూ అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ఆందోళనలు కూడా నిర్వహించారు. చివరకు ప్రభుత్వం మారిన తర్వాత వారికి సర్టిఫికెట్లు దక్కాయి. దాంతో కేసు విచారణ కొలిక్కి వస్తుందని అంతా ఆశించారు. కానీ తీరా చూస్తే తోట త్రిమూర్తులని కూడా అనూహ్యంగా వైఎస్సార్సీపీ కండువా కప్పి జగన్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇది రామచంద్రాపురంలో సుదీర్ఘకాలంగా త్రిమూర్తులుని ఢీకొడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. అందుకు అనుగుణంగానే ద్రాక్షరామలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవుతుండగా వైఎస్సార్సీపీకి చెందిన మేడిశెట్టి ఇజ్రాయేల్ దాడికి దిగడం వేడి రాజేసింది. వేణు వర్గీయుడిగా ఉన్న నేత ఇప్పుడు నేరుగా తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
రామచంద్రాపురంలో ఉన్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తోట త్రిమూర్తులు కూడా తీవ్రంగా మధనపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. జిల్లా వ్యాప్తంగానే సొంత సామాజికవర్గంలో త్రిమూర్తులకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాస్ లీడర్ అని అంతా భావిస్తుంటారు. అలాంటి త్రిమూర్తులకి జరిగిన అవమానం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా వివాదంగా మారుతున్న వేళ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోననే చర్చ మొదలయ్యింది. రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా పార్టీ ప్రయోజనాల పేరుతో ఇలాంటి నేతలందరినీ కలిపే ప్రయత్నాలు చేస్తుంటే దిగువన కార్యకర్తల మధ్య గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకత ఇలా బట్టబయటు కావడం ఇప్పుడు విశేషంగా మారుతోంది. ఓవైపు త్రిమూర్తులు కేసు విచారణ కొలిక్కి వస్తుందన్న నమ్మకం లేకపోగా, మరోవైపు ఇన్నాళ్లుగా పోరాడుతున్న తమకే నాయకుడిగా నెత్తిన పెట్టడం సహించలేని శ్రేణులు తిరగబడడం చర్చనీయాంశం అవుతోంది.