iDreamPost
android-app
ios-app

ఫిస్కల్‌ కౌన్సిల్‌ అంటే ఏమిటి..? టీడీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది..?

  • Published Jan 31, 2022 | 1:30 PM Updated Updated Jan 31, 2022 | 1:30 PM
ఫిస్కల్‌ కౌన్సిల్‌ అంటే ఏమిటి..? టీడీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది..?

జనాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అబద్దాన్ని నిజం అని నమ్మించడానికి ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తరచుగా డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని జనం అనుకోవాలనేది టీడీపీ ఉద్దేశం. అందుకే కొన్ని సాంకేతిక పదాలను పట్టుకొని మాట్లాడుతూ గందరగోళం సృష్టించాలని చూస్తోంది. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అదే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిందే అని మళ్లీ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుతోనే ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఎఫ్‌ఆర్‌ఎంబీ రివ్యూ కమిటీ సభ్యులు సిఫార్సు చేశారన్నారు. ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం ఏమైనట్లు అంటూ యనమల ప్రశ్నించారు.

ప్రయోజనం ఉంటుందా?

ఫిస్కల్‌ కౌన్సిల్‌ అంటే..ఒక స్వతంత్య్ర ఆర్థిక మండలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, వాస్తవంగా, శాస్త్రీయంగా అంచనా వేసి ఏమేం చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో మెరుగుపరచవచ్చో ఇది సూచిస్తుంది. కేంద్రంలోగాని, రాష్ట్రంలో గాని ఆర్థిక క్రమశిక్షణ లోపించి పూర్తిగా వ్యవస్థ గాడి తప్పితే దీన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తుండగా, రాష్ట్రంలో టీడీపీ ఆ పని చేస్తోంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం అనే సదుద్ధేశంతో కాక ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడానికే ఫిస్కల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Also Read : సీఎం జగన్ పై మళ్లీ నోరు పారేసుకున్న పట్టాభి

కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ఈ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆర్థికంగా క్రమశిక్షణను పాటించడం లేదని ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకనే ఈ డిమాండ్‌ను ప్రతిపక్షాలు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు తెరపైకి తెస్తుంటాయి. ఫైనాన్స్‌ కమిషన్‌, నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌, కాగ్‌ వంటివి ఇప్పటికే ఆ పనిని చేస్తున్నందున ఫిస్కల్‌ కౌన్సిల్‌ అవసరంలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా ఇటీవల విస్పష్టంగా చెప్పారు. దీనివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని, ఫిస్కల్‌ కౌన్సిల్‌ సంజీవని కాదు అని సోదాహరణంగా వివరించారు. అయినా యనమల అదే డిమాండ్‌ చేయడం రాజకీయ లబ్ధి పొందాలనే అని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

ఈ లెక్కలు కనిపించడం లేదా?

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ల వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. కోవిడ్‌ కారణంగా రాష్ట్రానికి రూ.8000 కోట్ల ఆదాయం తగ్గిపోగా, కోవిడ్‌ నుంచి జనాన్ని కాపాడడానికి రూ.7,120 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో చెల్లించని పెండింగ్‌ బిల్లులను రూ.41,900 కోట్లను 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చెల్లించింది. కరోనా కష్టకాలంలో కూడా 1.21 లక్షల కోట్లను ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా చేసిన అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల రాష్ట్రం బాగా అప్పుల కుప్పగా మారింది. దాని కారణంగా ఏటా రూ.20,000 కోట్లను వడ్డీలుగా చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం ఏమైనట్టు అని ప్రశ్నిస్తున్న మాజీ ఆర్థిక మంత్రి యనమలకు ఈ లెక్కలు కనిపించడం లేదా? అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Also Read : టీడీపీ నారీ సంకల్ప దీక్ష.. హవ్వ నవ్విపోదురుగాక..