iDreamPost
iDreamPost
ఏపీలోనే కాకుండా దేశంలోనే బియ్యం ఎగుమతుల్లో కాకినాడ పోర్ట్ నెంబర్ వన్ గా నిలిచింది. చత్తీస్ ఘడ్, తెలంగాణా సహా ఏపీలో భారీగా ధాన్యం దిగుబడులు పెరగడంతో కాకినాడ నుంచి వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవ ఉపయోగపడుతోంది. గతంలో కేవలం డీప్ వాటర్ పోర్ట్ నుంచి మాత్రమే బియ్యం ఎగుమతులు జరిగేవి. ఏడాది కాలంలో యాంకరేజ్ పోర్ట్ కి కూడా అనుమతినిచ్చారు. దాంతో ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. ఏటా నాలుగు లక్షల మిలియన్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరుగుతోంది. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. కాకినాడ నుంచి ఎగుమతులు పెరగడం రుచించడం లేదు
నిజానికి టీడీపీ దుగ్ద కాకినాడ పోర్ట్ మీద కాదు. అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీద. ద్వారంపూడి దూకుడిని టీడీపీ అడ్డుకోలేకపోతోంది. అందుకే కాకినాడ పోర్టుని అడ్డుగా పెట్టుకుని నిందలు వేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఇదే రీతిలో హెరాయిన్ దిగుమతి అవుతుందంటూ టీడీపీ, పచ్చమీడియా రెచ్చిపోయాయి. చివరకు కాకినాడ ఏటిలో తగులబడిన బోటు కూడా హెరాయిన్ దిగుమతి అంటూ నోటికొచ్చింది మాట్లాడారు.. తీరా కేంద్ర ప్రభుత్వం కాకినాడ నుంచి గానీ ఏపీ నుంచి హెరాయిన్ ఎగుమతులు, దిగుమతులకు అవకాశం లేదని తేల్చిచెప్పడంతో ఆ కథ ముగిసిపోయింది.
ఇప్పుడు టీడీపీ మరో కథను తెరమీదకు తెచ్చింది. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారంటూ విమర్శలకు పూనుకుంది. వాస్తవానికి కాకినాడ నుంచి రేషన్ బియ్యం, పామాయిల్ అక్రమాల ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. పామాయిల్ దిగుమతులను దారి మళ్లిస్తూ టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు గ్రంథి బాబ్జీ చిక్కుల్లో పడ్డారు. అప్పట్లో టీడీపీ నాయకుడి తనయుడు అరెస్ట్ కూడా అయ్యారు. ఇక రేషన్ బియ్యం పాలిష్ చేసి ఎగుమతులు చేస్తున్న తీరు అనేక సంవత్సరాలుగా సాగుతోంది. కాకినాడకు తరలిస్తున్న అలాంటి బియ్యాన్ని తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో పలు చోట్ల అడ్డుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. కాకినాడలోని ఓ గోడౌన్ లో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న సంఘటన చంద్రబాబు హయాంలోనే జరిగింది.
చాలాకాలంగా ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తుంటే ఇప్పుడే ఏదో కొంపలు మునిగినట్టు టీడీపీ రాద్ధాంతం మొదలెట్టింది. ఏదయినా తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కాకినాడ పోర్టు పరువు తీసే ప్రయత్నం చేస్తోంది. కాకినాడ పోర్టు ఎగుమతులు, దిగుమతుల్లో గుర్తింపు సాదిస్తుండగా టీడీపీ మాత్రం దాని చుట్టూ వివాదాలు రాజేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే యత్నం చేస్తోంది. బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు జరిగితే విమర్శించడం విపక్షాల బాధ్యత అవుతుంది. కానీ దాని చుట్టూ విషం జల్లి ప్రతిష్టాత్మక పోర్టుని బద్నాం చేయాలని చూడడం విస్మయకరంగా మారుతోంది.
Also Read : ఇదేమీ చిల్లర రాజకీయం యరపతినేని..?