iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?

డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల వ్యవహారం ఆసక్తిగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్క అంశంలో సర్కారు మీద దాడి చేస్తుంటారు. కానీ అది జనాలకు రుచిస్తుందా లేదా అన్నది మాత్రం విస్మరిస్తుంటారు. ఇప్పటికే అనేక అంశాలలో ఇది స్పష్టమయ్యింది. నిజమైన ప్రజా సమస్యలు వదిలేసి ప్రజలకు పట్టని అంశాలకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే ప్రతిపక్షాలు పలుచన అవుతున్నాయని టీడీపీలోనే చాలామంది వాపోవాల్సి వస్తోంది. అందుకు తాజా ఉదాహరణ డ్రగ్స్.

దేశంలో డ్రగ్స్ సమస్య పెరుగుతోందన్నది వాస్తవం. డ్రగ్స్ వ్యవహారం తెలంగాణా వంటి రాష్ట్రాల్లో రాజకీయంగానే దుమారం రేపుతోంది. వైట్ ఛాలెంజులు విసురుకునే వరకూ వెళ్లింది. స్వయంగా సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలకు దారితీసింది. అంతకుముందు పంజాబ్ లో డ్రగ్స్ వినియోగమే ఎన్నికల ఎజెండాగా ఉండేది. ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ పెద్ద తలనొప్పిగా యువతను చెడగొట్టేందుకు సాధనమవుతోంది.

తాజాగా ఏపీకి చెందిన సుధాకర్ అనే వ్యక్తి సంపాదించిన జీఎస్టీ లైసెన్స్ ఆధారంగా విజయవాడ అడ్రస్ తో భారీగా డ్రగ్స్ రవాణా అవుతూ గుజరాత్ లో పట్టుబడింది. అంతకుముందు అసోంలో, యూపీలో పట్టుబడింది. హైదరాబాద్ , ముంబై వంటి నగరాల్లో డ్రగ్స్ దందా ఈ నాటిది కూడా. కానీ ఏపీలో విపక్షం మాత్రం డ్రగ్స్ అన్నీ ఏపీకి వస్తున్నట్టు, ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నట్టు విమర్శలకు పూనుకుంది. తొలుత విజయవాడ, తాడేపల్లి నేతలంటూ ప్రచారానికి పూనుకున్న టీడీపీ ఇప్పుడు కాకినాడకు మరల్చింది. కృష్ణపట్నానికే డ్రగ్స్ వచ్చేస్తున్నాయని జ్యోతి రాతల్లో రాసేసి ఇప్పుడు మాత్రం కాకినాడ ఎమ్మెల్యే మీద గురిపెట్టారు.

Also Read : హెరాయిన్ కేసులో నిందితుడు సుధాకర్ ఎవరు?అతని వెనక ఎవరున్నారు?

ఇటీవల తన వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఆఫ్రికాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు. ఇప్పుడదే టీడీపీ నేతలకు పెద్ద ఆధారం అన్నట్టుగా మారింది. ఆఫ్రికా వెళ్లారు కాబట్టి డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారనే వాదన చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. థాయిలాండ్ వెళ్లారు కాబట్టి వ్యభిచారం, అమెరికా వెళ్లారు కాబట్టి ఆయుధ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆఫ్రికా వెళ్లిన వారంతా డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నట్టేననే టీడీపీ వాదన అలానే ఉంటుంది.

కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు నిత్యం బియ్యం ఎగుమతులు వెళుతూ ఉంటాయి. తాను అదే వ్యవహారంలో వ్యాపారం కోసం వెళ్లానని చెప్పినా సుధాకర్ అనే వ్యక్తి గతంలో కాకినాడ కి చెందిన అలీషా అనే వ్యక్తి దగ్గర పనిచేశారు కాబట్టి, అలీషా అనే వ్యాపారి ద్వారంపూడికి తెలుసు కాబట్టి ఈ డ్రగ్స్ వెనుక ద్వారంపూడి ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించడం విడ్డూరంగా కనిపిస్తోంది.

అనపర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ ఆరోపణలు చేశారు. అలానే అనుకుంటే అనపర్తిని ఆనుకుని ఉన్న ద్వారపూడికి చెందిన వ్యక్తి సుధాకర్. కాబట్టి ద్వారంపూడికి సంబంధం ఏముంటుంది, అనపర్తి మాజీ ఎమ్మెల్యేకి గానీ ఇప్పుడు మండపేట నియోజకవర్గానికి చెందిన గ్రామం కాబట్టి అక్కడి టీడీపీ ఎమ్మెల్యే గానీ ముడిపెట్టేస్తే అర్థం ఉంటుందా. కాకినాడలో ఎప్పుడో పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే మనిషే అనడం టీడీపీ వాదనలో ఢొల్లతనం బయటపెడుతుంది. పైగా డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టాలని ప్రయాసపడుతున్న తీరుని చాటుతోంది. నిజంగా టీడీపీకి డ్రగ్స్ ప్రమాదం పట్ల చిత్తశుద్ది, యువత పట్ల ప్రేమ ఉంటే డ్రగ్స్ వినియోగంపై ప్రచారం చేయాలి. అంతే తప్ప ఇలాంటి వాదనలతో ఆపార్టీ సాధించేదేమి ఉండదనేది తెలుసుకుంటే మంచిదేమో.

Also Read : హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి