Idream media
Idream media
అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు.. అరెస్ట్ అవగానే అనారోగ్యం పాలవుతారు. జైలుకు వెళ్లాల్సిన వారిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళతారు. సౌకర్యవంతమైన ఆస్పత్రి గదిలో వారు.. బయట కాపలాగా పోలీసులు ఉంటారు. ఇది చదువుతుంటే.. తెలుగు సినిమాల్లో సీన్లు గుర్తుకు వస్తోంది కదూ..? ఇలాంటివి సినిమాల్లోనే కాదు వాస్తవంలోనూ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హాయంలో వివిధ స్కాంలు, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు.. అవి ఇప్పుడు బయటకు వచ్చి, కేసులు, అరెస్ట్‌లుకు దారితీస్తుండడంతో జైలు జీవితం నుంచి తప్పించుకునేందుకు అచ్చం సినిమాల్లో మాదిరిగా అనారోగ్యం అనే కారణం చూపుతూ బెయిల్ కోసం కోర్టుకు వెళుతున్నారు.
గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అశోక్‌బాబు డిగ్రీ చదవకపోయినా చదవినట్లు సర్టిఫికెట్ పెట్టి వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పదోన్నతి పొందారు. ఈ విషయంలో విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన లోకయుక్త.. ఆ తర్వాత సమగ్ర విచారణ జరపాలని సీఐడీకి ఆ ఫిర్యాదును బదిలీ చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన సీఐడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది.
అశోక్‌బాబు అలా అరెస్ట్ అయ్యారో లేదో.. శుక్రవారం ఉదయాన్నే హైకోర్టులో బెయిల్ మంజూరు చేయాలని లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారించాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది ఆ పిటిషన్‌లో కోరారు. మొత్తం మీద శుక్రవారం మధ్యాహ్నం ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అశోక్‌బాబు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. బెయిల్ మంజూరు కోసం చేయడానికి చూపిన కారణం విచిత్రంగా ఉంది. అశోక్‌బాబు ఏ తప్పు చేయలేదనో, అక్రమంగా కేసు పెట్టారనో, కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేశారనో లాంటి కారణాలు చెప్పలేదు. తన క్లయింటుకు అనారోగ్యంగా ఉందని, ఈ కారణంగా తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని అశోక్‌బాబు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల తర్వాత పిటిషన్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Also Read : అరెస్ట్ చేసేటప్పుడు వారం, వర్జ్యం చూస్తారా?
గురువారం రాత్రి ఓ పంక్షన్‌కు వెళ్లిన అశోక్‌బాబు 11:30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కేవలం 10 గంటల్లోనే పిటిషన్ దాఖలైంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న అశోక్‌బాబు, అరెస్ట్ అయిన తర్వాత కేవలం పది గంటల వ్యవధిలోనే ఆయన ఆనారోగ్యానికి గురవడమే ఆశ్చర్యంగా ఉంది. జైలు జీవితం నుంచి తిప్పించుకునేందుకు టీడీపీ నేతలు ఇలాంటి సినిమా డ్రామాలు ఆడడం సర్వసాధారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు కూడా అప్పట్లో జైలు జీవితం నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యాన్ని కారణంగా చూపారు. ఫైల్స్ ఆఫరేషన్ తర్వాత.. ఏసీబీ అధికారులు శ్రీకాకుళం నుంచి విజయవాడకు అచ్చెం నాయుడును తీసుకురావడంతో బ్లీడింగ్ అయిందని, ఆయనకు చికిత్స అవసరమని వాదించిన న్యాయవాదించడంతో విజయవాడ ఏసీబీ కోర్టు అచ్చెం నాయుడును గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. దాదాపు నెల రోజులు అచ్చెం నాయుడు ఆస్పత్రిలో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకున్నారని వైద్యులు చెప్పినా.. లేదు.. లేదు నేను ఇంకా కోలుకోలేదంటూ అచ్చెం నాయుడు రభస చేశారు. జైలుకు వెళ్లడం తప్పించుకునేందుకు అచ్చెం నాయుడు వేసిన ఫ్లాన్ ఫెయిల్ అవడంతో విజయవాడ సబ్‌జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
మళ్లీ ఐదు రోజులకే హైకోర్టులో పిటిషన్ వేసిన అచ్చెం నాయుడు.. ఆయన కోరుకున్నట్లుగా రమేష్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ దాదాపు 40 రోజులు ఉన్న అచ్చెం నాయుడు.. బెయిల్ మంజూరైన తర్వాతగానీ డిఛ్చార్జి కాలేదు. ఫైల్స్ సమస్యతో అచ్చెం నాయుడు దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండడం వైద్య రంగంలోనే రికార్డుగా నమోదైంది. ఇప్పుడు అచ్చెం నాయుడు మాదిరిగానే అశోక్‌బాబు కూడా జైలు జీవితం తప్పించుకునేందుకు అనారోగ్యాన్ని సాకుగా చూపుతుండడం విశేషం.
Also Read : అశోక్ బాబుని కొట్టారా?