iDreamPost
iDreamPost
వెనకటికొకడు ఇక్కడెట్టిన గుమ్మడికాయలు కన్పించడం లేదేంటయ్యా అంటే ఎదురుగా ఉన్న పెద్దమనిషి ఏమో నాకేం తెలుసుకు అంటూ భుజాలు తడుముకున్నాడంట. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పరిస్థితి అలాగే ఉందనుకుంటున్నారు జనం. మీకు సంబంధం లేని విషయం మీద మరీ అంత వాగ్ధాటితో సమర్దన చూస్తుంటే గుమ్మడికాయలే గుర్తుస్తున్నాయన్నది ఉభయతెలుగురాష్ట్రాల్లోని వారి అభిప్రాయం.
సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఇప్పుడు టీడీపీలో లేరు (ఉన్నారు అని మీరు అనుకుంటే మాత్రం మాకు సంబంధం లేదు). వాళ్ళ గురించి మీరు వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం జనం దృష్టిలో మీకస్సలే లేదు. కోర్టు సంబంధిత వ్యవహారాలతో బిజీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఆయనకు ఏదైనా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే మీరు జోక్యం చేసుకుని మైకులముందుకొచ్చి ఢంకా బజాయించేయొచ్చు. ఇప్పటికప్పుడు ఆయనక్కూడా వచ్చిన ఇబ్బందేమీ లేదు.
వీళ్ళముగ్గురూ ఒకే హోటల్‌లో కూర్చుని మంతనాలు జరుపుతున్నారన్న విషయం మీద అసలు మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? అన్నదే ఇక్కడ జనం నుంచి వస్తున్న ప్రశ్న. వివరణ అంటూ ఇవ్వాల్సి వస్తే బీజేపీ వాళ్ళివ్వాలి లేదా నిమ్మగడ్డ నుంచి రావాలి. అదేందయ్యా.. బాబూ టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో మీరిచ్చేసారు. మీరు పొరపాటున ఒప్పుకున్నా, మనసులో ఉన్నది అనుకోకుండా బైటకు వచ్చేసినా గానీ జనం అనుకుంటున్నట్లు ‘‘వేరే పార్టీలో ఉన్నాగానీ, ప్రభుత్వ అధికారి అయినా గానీ వీళ్ళంతా టీడీకే పనిచేస్తున్నారు’’ అన్న మాటల్ని వర్ల రామయ్యద్వారా టీడీపీ ఒప్పేసుకున్నట్టేనా..?