Idream media
Idream media
అమరావతే రాజధానిగా ఉండాలంటూ సుదీర్ఘకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం టీడీపీ వెనుక ఉండి తతంగం నడిపిస్తోంది. అమరావతికే తమ మద్దతు అంటూ అవకాశం దొరికినప్పుడల్లా అధినేత చంద్రబాబు సహా మిగిలిన నేతలందరూ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. రాజధాని పేరుతో సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తుంటారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఏపీ సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ. ఇవేమీ ప్రజలు పట్టించుకోవడం లేదని గతంలో విజయవాడ గుంటూరు విశాఖ కార్పొరేషన్ల ఫలితాలు నిరూపించాయి.
గత అనుభవాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్పొరేషన్ నెల్లూరు. ఇక ఇప్పుడు వచ్చిన అవకాశం.. నెల్లూరు. ఇక్కడ విజయం దక్కించుకుని.. వైసీపీ సర్కారుపై ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని తాము నిరూపిస్తామని.. నాయకులు.. ప్రతిజ్ఞలు చేశారు. ప్రధానంగా మంత్రి అనిల్ కుమార్ కు నెల్లూరు నుంచి గట్టి సమాధానంగా టీడీపీ ని విజయం వైపు నడిపించాలని, ఈ ఎన్నికలను అవకాశం గా మార్చుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే స్థానిక నాయకులతో పాటు.. రాష్ట్ర పార్టీ చీఫ్.. అచ్చెన్నాయుడు..మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. వంటివారు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించారు.
అయినప్పటికీ.. టీడీపీ ఇక్కడ గెలుపుగుర్రం ఎక్కలేకపోయింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం అన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ దాదాపు విజయం దక్కించుకుంది. మరి దీనికి రీజనేంటి? ఎందుకు ఇలా జరిగింది. గత ఎన్నికల తర్వాత.. చాలా భిన్నంగా.. నెల్లూరు రాజకీయాలను శాసించాలని.. చంద్రబాబు ప్రయత్నించినా పప్పులుడకలేదు. సవాల్ చేసినట్లుగానే మంత్రి అనిల్ ఆ కార్పొరేషన్ ను వైసీపీ పరం చేశారు. ఇందుకు కారణాలేంటని అన్వేషించే పనిలో బాబు ఉన్నారు.
వాస్తవానికి కుప్పం తో పాటు నెల్లూరును చేజిక్కించుకోవాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా విజయం సాధించలేకపోయారు. నెల్లూరుకు వచ్చేసరికి బీద రవిచంద్రయాదవ్కు ముందు బాధ్యతలు అప్పగించారు. అయితే.. తర్వాత.. ఆయనను అలా నే ఉంచినా.. రాష్ట్రస్థాయి నేతలను రంగంలోకి దింపారు. దీంతో పార్టీలో ఒకింత నేతల మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ.. ఎవరూ ఊహించలేదు. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కూడా అన్నీతానై వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కూడా ప్రచారం చేశారు. ఎంత చేసినా, ఏం చేసినా టీడీపీని జనం నమ్మలేదు. దీంతో పార్టీలో అంతర్మథన మొదలైంది. జనాన్నిఎలా ఆకట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
Also Read : Hindupur, Chilamathur ZPTC – కూలుతున్న తెలుగుదేశం కోటలు.. ఈ రోజు బాలయ్య వంతు