iDreamPost
android-app
ios-app

విజయవాడకు ఎన్టీఆర్ పేరు వద్దంటూ టీడీపీ నేతల దీక్షలా?

  • Published Feb 11, 2022 | 5:39 AM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
విజయవాడకు ఎన్టీఆర్ పేరు వద్దంటూ టీడీపీ నేతల దీక్షలా?

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అంశం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ. ఈ హామీ ప్రకారమే విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించారు. అయితే ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిన జిల్లాకు పెట్టటాన్ని స్వాగతించాల్సిన టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త రాగం మొదలు పెట్టారు. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నేత బోండా ఉమా విజయవాడ కొత్త జిల్లాకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని గత వారం రోజులుగా ఆందోళన మొదలు పెట్టారు. ఇలాంటి డిమాండుతో ఆందోళన మొదలు పెట్టాలంటే బోండా ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతి ఖచ్చితంగా అవసరం. అలాంటి అనుమతి బోండా ఉమకు చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉంటారు. ఆయన అనుమతి లేకుండా ఇటువంటి నిర్ణయం తీసుకుని దాన్ని ఓ ఉద్యమంలా చేసే అవకాశం లేదు. అంటే బోండా ఉమా విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టమని చేస్తున్న డిమాండుకు చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్నట్టే అనుకోవాలి. 

విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించినపుడు స్వాగతించడానికి చంద్రబాబు నాయుడు కొంత సమయం తీసుకున్నారు. పురందేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ  అప్పటికి ఇంకా ఈ నిర్ణయాన్ని స్వాగతించలేదు. పురందేశ్వరి కూడా ఆ నిర్ణయం ప్రజాభీష్టం అంటూ పుల్లవిరుపు మాటలు ట్విట్టర్లో రాశారు తప్ప ఆ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానీ కనీసం మర్యాద కోసం అయినా అభినందించలేదు, ధన్యవాదాలు చెప్పలేదు. మరోవైపు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ముక్తసరిగా ప్రస్తావించిన ఎన్టీఆర్ కొడుకు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నారు.

అవసరం అయితే హిందూపురం జిల్లా ఏర్పాటుకోసం తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా అంటూ ప్రకటించేశారు. 

చంద్రబాబు నాయుడు కోసం ఒకే వేదికపైకి వచ్చి మీడియా సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ వారసులు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదిస్తే స్వాగతించడానికి లేదా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పడానికి వారికి గొంతు పెగలలేదు. ఇంతవరకూ ఆ వారసులు ఉమ్మడి ప్రకటన చేయలేదు.

అలాగే ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించిన విజయవాడకు వేరే పేరు ప్రతిపాదిస్తున్న టీడీపీ నేత డిమాండును ఖండించేందుకు కూడా వారికి గొంతు పెగలడం లేదు. చంద్రబాబు నాయుడు కంటతడి పెడితే ఏకం అయిన ఎన్టీఆర్ వారసులు, ఎన్టీఆర్ పేరు తీసేయండి అని పరోక్షంగా డిమాండు చేస్తున్న టీడీపీ నేతను మందలించేందుకు కానీ, ఆ డిమాండును ఖండించేందుకు, విజయవాడకు తమ తండ్రి పేరు ఉండాల్సిందే అనే ప్రకటన చేసేందుకు కానీ ఎన్టీఆర్ వారసులెవరికీ గొంతు పెగలడం లేదు. 

ఒక కాపు నాయకుడిగా వంగవీటి రంగా అనుచరుడిగా విజయవాడకు రంగా పేరు పెట్టాలని బోండా ఉమా డిమాండు చేయడంలో తప్పుపట్టాల్సిందేమీ లేదు. అయితే ఆయన టీడీపీ నేత కాబట్టి ఆయన డిమాండుపై టీడీపీ నాయకత్వం, ఎన్టీఆర్ వారసులు స్పందించాల్సి ఉంది. వారు మౌనంగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఎన్టీఆర్ పేరు బదులు వంగవీటి రంగా పేరు పెట్టమనే డిమాండునే  బలపర్చుతున్నట్టు ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.

మరో రకంగా చెప్పాలంటే టీడీపీకి కానీ, ఎన్టీఆర్ వారసులకు కానీ ఎన్టీఆర్ కంటే రంగాయే ముఖ్యం అన్నట్టు కనిపిస్తోంది.

ప్రతి యేడాది టీడీపీ మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఏదో మొక్కుబడి తీర్మానాలు చేసి మీడియాకు విడుదల చేయడం తప్ప ఎన్టీఆర్ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు లేదు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కాకుండా రంగా పేరు పెట్టాలని డిమాండు చేస్తున్న బోండా ఉమా ఎన్టీఆర్, రంగా బొమ్మలు పక్కపక్కనే పెట్టుకుని ఉద్యమం చేస్తున్నారు. ఎన్టీఆర్ బొమ్మ పక్కన రంగా బొమ్మ పెట్టడం చాలా మంది రంగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రంగా హత్యకు గురైంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేది చరిత్ర చెప్తున్న సత్యం. రంగాను హత్య చేయించింది ఎన్టీఆర్ అని రంగా అభిమానులు ఎవర్ని అడిగినా చెప్తారు. అలాంటి ఎన్టీఆర్ బొమ్మ పక్కన రంగా బొమ్మ పెట్టడం ఎలాంటి రాజకీయమో, అటువంటి రాజకీయాన్ని తెరచాటునుండి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆ రాజకీయాన్ని నడిపిస్తున్న బోండా ఉమా చెప్పాల్సి ఉంది.

అలాగే ఈ రాజకీయ డ్రామాకు ప్రేక్షకులుగా మారి చోద్య చూస్తున్న ఎన్టీఆర్ వారసులు చెప్పాల్సి ఉంది. మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ చెప్పుకునే ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు తండ్రి పేరు విజయవాడ జిల్లాకు పెట్టకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేత పట్ల, ఈ నాటకాన్ని తెరవెనుక ఉండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు పట్ల ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టించుకోవడం కంటే హిందూపురం జిల్లా కేంద్రంగా చేసుకోవడమే ముఖ్యం అన్నట్టు ఉన్న బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతారు అనే ప్రశ్నకు కూడా ఎన్టీఆర్ కుటుంబం జవాబు చెప్పాల్సి ఉంది.

Also Read : చెప్పిన స‌మ‌యానికే కొత్త జిల్లాలు : స్ప‌ష్టం చేసిన జగన్‌