iDreamPost
iDreamPost
రాష్ట్ర ప్రభుత్వంపై తాము చేసే విమర్శలకు సంబంధించి కనీస అవగాహన, విషయ పరిజ్ఞానం లేకుండా టీడీపీ నేతలు మీడియాసాక్షిగా ఆరోపణలు గుప్పించేస్తున్నారు. కేవలం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడమే వారి ఉద్దేశం అని స్పష్టంగా అర్థమవుతున్నా ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. తాజాగా టీడీపీ నేత బోండా ఉమ చేసిన విమర్శలు విస్తుగొలుపుతున్నాయి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనోభావాలను జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గడువిచ్చిన సంగతి తెలియదా?
జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 13 నుంచి 26కి జిల్లాల సంఖ్యను పెంచిన వివరాలు తెలియజేసింది. దానిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయడానికి 30 రోజులు గడువు ఇచ్చింది. పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వం ఇంత పారదర్శకంగా వ్యవహరించినా టీడీపీ నేత ఉమ అడ్డగోలు విమర్శలు చేయడం శోచనీయం. ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని అనడం కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయం అని వైఎస్సార్ సీపీ నేతలు తప్పు పడుతున్నారు.
అమరావతిని సొంత పార్టీ వ్యవహారంలా చేసింది మీరే కదా..
రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలను గౌరవించకుండా అమరావతిని సొంత పార్టీ వ్యవహారంలా చంద్రబాబు నాయుడు మార్చారు కదా అని గుర్తుచేస్తున్నారు. రాజధాని పేరుతో ప్రపంచంలోనే ఆతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం రైతుల భూములు గుంజుకున్న ఘనత టీడీపీది అని ఎద్దేవా చేస్తున్నారు.
మంత్రి సవాల్ కు ఎందుకు స్పందించరు?
క్యాసినో వ్యవహారం నుంచి రాష్ట్ర ప్రజలదృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తెచ్చారని విమర్శలు చేస్తున్న ఉమ.. ఎందుకు మంత్రి కొడాలి నాని సవాల్ కు స్పందించడం లేదు. క్యాసినో జరిగినట్లు 10 రోజుల్లో రుజువు చేయాలని మంత్రి సవాల్ చేస్తే పట్టించుకోకుండా గాలి విమర్శలు గుప్పిస్తే ఎవరు నమ్ముతారు. కొత్త జిల్లాల అంశంపై రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేస్తామని, అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని బోండా ఉమ చెప్పడం పబ్లిసిటీ ఎత్తుగడ అని వైఎస్సార్ సీపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. గడువులోగా ప్రభుత్వానికి తమ సలహాలు చెప్పడం మానేసి అర్థంలేని వీధి పోరాటాలు చేయడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : వంగవీటి రంగా జిల్లా- బోండా ఉమా వర్సెస్ రాధా