iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ : ఎన్నికల బాధ్యత తీసుకోకుండా రేవంత్ ఎందుకు వెనుక‌డుగు వేశాడు ?

హుజూరాబాద్ : ఎన్నికల బాధ్యత తీసుకోకుండా రేవంత్ ఎందుకు వెనుక‌డుగు వేశాడు ?

తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్ రెడ్డికి ఎదుర‌య్యే మొద‌టి ప‌రీక్ష హుజూరాబాద్ ఉప ఎన్నిక అని అంద‌రూ భావించారు. ఆ ప‌రీక్ష‌లో నెగ్గితే అత‌నికి తిరుగుండ‌ద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక‌ను రేవంత్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటార‌ని, ప్ర‌తీ అంశాన్ని ద‌గ్గ‌రుండే చూసుకుంటార‌ని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యత ను.. ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహకు అప్పగిస్తూ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌ల నుంచి రేవంత్ రెడ్డి త‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్క‌డ ఎలాగూ గెలిచే అవ‌కాశాలు లేవ‌ని ముందే ఊహించి రేవంత్ సైడ్ అయ్యారా? లేక ఇత‌ర కార‌ణాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఎంద‌రు వ్య‌తిరేకించినా తెలంగాణ పీసీసీ ప‌గ్గాలు అధిష్టానం రేవంత్ కే ఇచ్చింది. త‌న‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి రేవంత్ రెడ్డి మొద‌టి నుంచే హ‌డావిడి చేయ‌డం మొద‌లుపెట్టారు. వ‌రుస ఇంట‌ర్వ్యూలు, స‌మావేశాల ద్వారా త‌న వాయిస్ ను బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌ల దాడి పెంచ‌డంతో కాంగ్రెస్ నేతలు, కేడ‌ర్ లో అంచనాలు భారీగా పెరిగాయి. ఏ ఎన్నిక వచ్చినా గట్టిగా పోరాడే అవ‌కాశాలు పెరిగాయ‌నే ధీమా పెరిగింది. దీంతో ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ క్యాడర్ అలాగే భావిస్తోంది. అంతేకాదు కొంత మంది కాంగ్రెస్ బడా నేతలు సైతం.. ఈ ఉప ఎన్నిక పోరును ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. పీసీసీ కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన టీమ్.. ప్రధానంగా రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పై కూడా డిస్కషన్ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యత ను.. ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కు అప్పగించాలని నిర్ణయించారు. ఆమేరకు ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అభ్యర్థి ఎంపిక విషయంపై కూడా దామోదర రాజనర్సింహకే పూర్తి అధికారాలు ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సైలెంట్ గా ఉంటుండటం.. ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాఫిక్ గా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ సైలెంట్ గా ఉండటం వెనక అనేక వ్యూహాలు ఉన్నట్లు గాంధీ భవన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా అందరూ వ్యతిరేకించినా.. అధిష్టానం సీనియర్లందరినీ కలుపుకొని పోవాలని రేవంత్ కు సూచించిందట. అంతేకాదు.. సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లాలని.. అందులో భాగంగానే ఎలక్షన్ కమిటీ చైర్మన్ కు బాధ్యతలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే.. హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, ఈ స్థితిలో ఎక్కువ చాన్స్ తీసుకున్నా.. ఫలితాలు తేడా వస్తే అసలుకే మోసం అవుతుందనే భావనలో రేవంత్ ఉన్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.