iDreamPost
android-app
ios-app

పయ్యావుల మౌనానికి అర్థం ఏమిటో?

  • Published Jun 25, 2021 | 10:27 AM Updated Updated Jun 25, 2021 | 10:27 AM
పయ్యావుల మౌనానికి అర్థం ఏమిటో?

అనంతపురం జిల్లా టీడీపీలో ఆయనో కీలక నేత. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచిన వారిలో ఒకరు బాలకృష్ణ అయితే.. రెండో ఎమ్మెల్యే ఈయనే. రాష్ట్ర టీడీపీలో బలమైన వాయిస్ ఉన్న నేతల్లో ఒకరిగా.. సీనియర్ గా గుర్తింపు పొందిన ఆ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. అటువంటి నేత గత రెండేళ్లుగా దాదాపు మౌనంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమల్లో గానీ, ప్రజల్లో గానీ పెద్దగా కనిపించడం లేదు. వాయిస్ కూడా వినిపించడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమల్లో పాల్గొనాల్సి వస్తే.. మొక్కుబడిగా వచ్చి, పొడి పొడిగా మాట్లాడి వెళ్లిపోతున్నారు. వ్యూహాత్మకంగా ఈయన పాటిస్తున్న మౌనానికి అతని అనుచరులు, టీడీపీ శ్రేణులు, ప్రజలు రకరకాల భాష్యాలు చెబుతున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యే

అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి ఉరవకొండలో పయ్యావుల కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆయన తండ్రి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. తొలినుంచి టీడీపీలో ఉన్న కేశవ్ కూడా ప్రస్తుతం నాలుగో టర్మ్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. 1994, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన అసెంబ్లీలోనూ, బయటా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా పయ్యావుల ఓడిపోయారు. తర్వాత ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా.. తగినంత గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న అసంతృప్తి మొదలైంది.

ఫిరాయింపుదారులకేనా అవకాశం

పార్టీలో సీనియర్ గా ఉంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడి పార్టీ వాదనను బలంగా వినిపిస్తారని పేరున్న తనను అధినేత చంద్రబాబు గుర్తించలేదన్న నిరాశ పయ్యావులలో అప్పట్లోనే ఏర్పడింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి.. పార్టీ కష్టనష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న తనలాంటి వారికి అన్యాయం చేయడం ఆయన్ను, ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేసింది. ఇక 2019లో కేశవ్ గెలిచినా టీడీపీ ఓడిపోవడంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. పయ్యావుల అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు ఆయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీ ఏ సీ) పదవి కట్టబెట్టారు. అయినాసరే కేశవ్ మౌనం వీడలేదు. కమిటీ సమావేశాలు సైతం నిర్వహించలేదు. గత నెలలో నిర్వహించిన జూమ్ మహానాడులో సైతం మొక్కుబడిగా పాల్గొన్నారు.

పట్టించుకోని అధినేత

చాన్నాళ్లుగా కేశవ్ పార్టీకి దూరంగా ఉంటున్నా టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆయన్ను బుజ్జగించడానికి.. పిలిచి మాట్లాడటానికి ప్రయత్నించడంలేదు. పయ్యావుల అసంతృప్తిని, ఆయన పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారాన్ని కొందరు నేతలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా తేలిగ్గా తీసిపారేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. వెళ్లాలనుకున్నవారు ఆపినా ఆగుతారా అని కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పయ్యావుల రాజకీయ ప్రయాణం ఎటువైపు అన్న చర్చ జోరుగా సాగుతోంది.