Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన సినీ హీరో పవన్ కల్యాణ్. అన్న చిరంజీవి వేసిన బాటలో అడుగులు వేసినా సొంతంగా స్టార్డమ్ పెంచుకుని అనతికాలంలోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ.. ఏడేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించి.. ఓ రేంజ్ లో హైలెట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేస్తానని ప్రకటించారు. కానీ, పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అవుతున్నారా? అంటే పవన్ కళ్యాణే పరోక్షంగా అవునని చెప్పేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్లుగా జనసేన తెలంగాణలో యాక్టివ్ లేదన్న విషయం ఎప్పటి ఉంచో తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టినా పెద్దగా ఓట్లు సాధించలేకపోయారు. అయినప్పటికీ తెలంగాణలో జనసైనికులు పలు కార్యక్రమాల ద్వారా కనిపిస్తూనే ఉన్నారు. దీంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకరిద్దరు నామినేషన్లు కూడా వేశారు. అనూహ్యంగా బీజేపీ మద్దతుగా ఎన్నికల నుంచి తొలుగుతున్నట్లు అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో జన సేన లేనట్లే అని ఎప్పుడో తేల్చేశాయి పొలిటికల్ వర్గాలు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేశారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో పవన్ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాల గురించి ప్రశ్నించగా.. వేల కోట్లతో ముడిపడి ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన పని అని ఆయన బదులిచ్చారు. తాను పగటి కలలు కనే వ్యక్తని కానని ఉద్యమస్ఫూర్తి కలిగిన తెలంగాణ నేలపై కొత్త రక్తం చైతన్యం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణలో పార్టీ నిర్మాణం తనకు తలకు మించిన భారంగా మారే వీలుందని అందుకే పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏపీ రాజకీయాలపైనే శ్రద్ధ పెట్టిన ఆయన.. అక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్ర స్థాయిలో తెలుగు దేశం పార్టీకి అటు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన ఆయన.. ఆ పార్టీల తరపున ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఇటు రాష్ట్రంలో బీజేపీ అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఉండటంతో ఆ ఎన్నికల తర్వాత ఆయన తిరిగి ఇటు చూడలేదు. పార్టీకి సంబంధించి కీలకమైన కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా క్రియాశీలక కార్యక్రమాలు చేపట్టలేదు.
2018లో తెలంగాణలో ముందస్తు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పవన్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో సొంతంగా పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రం గెలవగలిగింది. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ కేంద్రంలోని బీజేపీతో జట్టుకట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. తన పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దించలేదు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.