Idream media
Idream media
మా ప్రాణాలంటే లెక్కలేదా..? అని ఉద్యోగులు ప్రశ్నించడాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు బడుతున్నారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లేనని అంటున్నారు. అన్నింటికీ అడ్డురాని కరోనా ఎన్నికలకే అడ్డొస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎస్ ఈసీ, ఉద్యోగుల మధ్య వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. వాటిలో నిజానిజాలు ఎలాగున్నా.. ఇటీవల ఎన్నికలు, ఉప ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్రాలు మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయా ఎన్నికల అనంతరం కరోనా కేసులు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రచార, సమావేశాల సందర్భంగా ఎందరో ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. పక్క రాష్ట్రంలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన నెగ్గిన ఓ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే కరోనా కాటుకు బలయ్యారు. ఎన్నికల అనంతరం ఎక్కువ మంది ఉద్యోగులు సెలవుల్లో ఉండడాన్ని పరిశీలిస్తే అందుకు కారణం కరోనా బారిన పడడమే అని తెలుస్తోంది. అదే ఏపీలో ఉద్యోగుల ఆందోళనకు కారణమవుతోంది.
బిహార్, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఎన్నికల అనంతరం కరోనా విభృంభించింది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసుల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వాలు గుర్తించాయి. కేరళ రాష్ట్రంలో నిన్న కూడా 6, 815 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారం రోజులుగా ఇదే తరహాలో కొవిడ్ కేసులు ఉంటున్నాయి. సగటున 6 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్నికలకు ముందు అక్కడ కరోనా అదుపులోకి వచ్చింది. వెయ్యి లోపే కేసుల నమోదు ఉండేది. కొన్ని రోజులైతే సింగిల్ డిజిట్ లోనే ఉండేవి. పంచాయతీ ఎన్నికల తర్వాత రోజుకు సగటున 6000 కేసులు నమోదు అవుతున్నాయి. 20 మంది వరకూ చనిపోతున్నారు. ఈ పరిణామాలే ఏపీలో ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వంతో కలిసి పనిచేసి కరోనాను కట్టడి చేయగలిగారు. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం వారిని కలవరానికి గురి చేస్తోంది. ఇంతలా ఆగ్రహానికి కారణమవుతోంది. ఎన్నికల అనంతరం ఆయా రాష్ట్రాలలో పరిస్థితులను అధికారిక లెక్కలే కళ్లకు కట్టినట్లు చూపెడుతున్నాయి. అయినప్పటికీ ఏపీలో ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ పట్టుబట్టడం విమర్శలకు తావిస్తోంది.
తెలంగాణ లోని గ్రేటర్ పరిధిలో కూడా కరోనా బారిన పడిన ఉద్యోగుల కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన ఆకుల రమేశ్ గౌడ్ అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఎన్నికల్లో ప్రచారంలో విరివిగా పాల్గొన్నందునే కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెంట్రల్ జోన్ పరిధిలో 32 మంది సిబ్బందికి వైరస్ సోకింది. వారిలో 5గురికి రెండో సారి కావడం మరింత కలకలం రేపింది. సైబరాబాద్ పరిధిలో మరో 23 మంది కరోనా బారిన పడ్డారు. రాచకొండలో 14 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికి కూడా పోలీసు సిబ్బందిలో కరోనా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 14 మంది పోలీసులు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 18 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ముగ్గురు అధికారులు గతంలో కరోనా సోకినవారే కావడం, వారిలో ఎక్కువగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నవారు కావడం గమనార్హం. వీరితో కలిసి పనిచేసిన మరో అధికారి, ముగ్గురు సిబ్బంది కొత్తగా కొవిడ్-19 బారినపడ్డారు. మరోవైపు పంజాగుట్ట ఠాణా మహిళా సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. వీరందరూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్నందునే కరోనా బారిన పడ్డారు. మొత్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మహమ్మారి బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. కానీ వీటినేమీ నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరమని ఏపీ ఉద్యోగులు వాపోతున్నారు.