iDreamPost
android-app
ios-app

విభ‌జ‌న‌పై మోడీ వ్యాఖ్య‌లు.. ఇప్పుడే ఎందుకిలా?

విభ‌జ‌న‌పై మోడీ వ్యాఖ్య‌లు.. ఇప్పుడే ఎందుకిలా?

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన ఏడున్న‌రేళ్ల త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌డం ఆస‌క్తిగా, ఆశ్చ‌ర్యంగా మారింది. మోడీ వ్యాఖ్య‌ల‌పై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌లుంటే.. ప‌రిష్క‌రించాల్సిన పెద్ద మ‌నిషే అయిపోయిన విష‌యంపై విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఏపీలో ఎలాగున్నా, తెలంగాణ నేత‌లు మాత్రం ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కే స‌మ‌యంలో ఏపీ విభ‌జ‌న అంశాన్ని కూడా మోడీ ప్ర‌స్తావించ‌డం వెనుకగ‌ల కార‌ణాల‌పై భిన్నవాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌కు, కేంద్రానికి మ‌ధ్య ఉప్పు, నిప్పుగా ఉన్న త‌రుణంలో ఈ త‌ర‌హా వాద‌న‌ను తెర‌పైకి తేవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

హ‌ఠాత్తుగా తెర‌పైకి..

మోడీడీ వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేస్తూ… కాంగ్రెస్ త‌ప్పు చేసింది స‌రే.. మీరైనా న్యాయం చేయండి.. అని ఏపీలోని మెజార్టీ వ‌ర్గాలు అంటుంటే.., తెలంగాణ‌పై ఎందుకింత క‌క్ష అంటూ ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ప‌లుమార్లు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌త్యేకహోదా కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండు నెల‌ల్లోనే రెండుసార్లు గుర్తు చేశారు. గ‌తంలో కూడా ప‌దులసంఖ్య‌లో విభ‌జ‌న అంశాల‌ను కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌స్తావించారు. చేస్తాం.. చూస్తాం.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే కానీ.. మెజార్టీ స‌మ‌స్య‌ల‌కు స‌రైన ప‌రిష్కారం చూప‌లేదు. కానీ.. ఇప్పుడు హ‌ఠాత్తుగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుత స‌మ‌స్య‌ల‌కు కాంగ్రెస్సే కార‌ణ‌మంటూ పార్ల‌మెంట్ లో మోడీ మాట్లాడ‌డంపై ఇరు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ‌లోని సీమాంధ్రుల ఓట్ల కోస‌మా..?

త‌లాపాపం తిలా పిడికెడు అన్న‌ట్లు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌లో కాంగ్రెస్ తో పాటు బీజేపీ పాత్ర కూడా ఉంది. విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ వాసులు సోనియ‌మ్మ‌తో పాటు.. ఈ చిన్న‌మ్మ‌ను కూడా మ‌రిచిపోవ‌ద్దంటూ సుష్మ‌స్వ‌రాజ్ వ్యాఖ్యానించ‌డం ద్వారా విభ‌జ‌నలో త‌మ పాత్ర కూడా ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అలాంటిది ఇప్పుడు హ‌ఠాత్తుగా కాంగ్రెస్ పై విరుచుకుప‌డ‌డానికి ప‌లు కార‌ణాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారమే ల‌క్ష్యంగా బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి రాష్ట్ర నాయ‌క‌త్వం వ‌ర‌కూ పావులు క‌దుపుతున్నాయి. రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దూసుకు పొమ్మంటున్నాయి. గ‌తంతో పోలిస్తే బీజేపీ పుంజుకుంటోంది కూడా. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని సీమాంధ్రుల అభిమానం చూర‌గొనేందుకే ఏడున్న‌రేళ్ల త‌ర్వాత విభ‌జ‌న‌పై మోడీ స్పందించార‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

డ్రామాల్లో ఆరితేరిన వ్య‌క్తి : త‌ల‌సాని

తాము తెలంగాణ‌కు వ్య‌తిరేకం కాద‌ని పేర్కొన్న‌ప్ప‌టికీ మోడీ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ పట్ల మోడీలో విపరీతమైన ద్వేషం ఉందని, పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన కామెంట్సే దీనికి నిదర్శనం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని అన్నారు. పార్లమెంటుకు రాని వ్యక్తి మోడీ అని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నువ్వు ఏం న్యాయం చేశావో చెప్పు.’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయడాన్ని వ్య‌తిరేకిస్తూ, సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుందని హెచ్చరించారు.

2004లోనే ఇచ్చి ఉంటే…

తెలంగాణ ఎదుగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఓర్వలేకపోతున్నారని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు కలిసి ఉంటే ప్రధాని మోడీకి నచ్చట్లేదని విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణపై ఆయన అక్కసు ఇంకా పెరుగుతోందన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలను పవర్ ప్లాంట్‌ను ఆంధ్రాలో కలిపింది మోడీ నే అని దుయ్యబట్టారు. ‘‘ఇవాళ తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.. నాటీ బీజేపీ ప్రభుత్వం 2004 లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగి ఉండేవా?’’ అని ప్రశ్నించారు. వందలాది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్, బీజేపీ లే కారణం అని నిప్పులు చెరిగారు.

Also Read : విభజన కష్టాలు ఏడేళ్లుగా పరిష్కరించలేకపోయారా మోడీజీ?