Idream media
Idream media
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆందోళనతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు హఠాత్తుగా ఊడిపడ్డ ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్ వేర్ వ్యవహారం నాటి నుంచి నేటి వరకూ పార్లమెంట్ ను కుదిపేస్తూనే ఉంది. దేశంలోని ప్రతిపక్షాలు ప్రముఖులు జర్నలిస్టులు సుప్రీంకోర్టు జడ్జీల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసిన వ్యవహారంపై పార్లమెంట్ లో రచ్చ కొనసాగుతోంది. వర్షకాల సమావేశాలు ప్రారంభం రోజున 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చేసింది. అప్పటికే మోడీ సర్కార్ పై దేశంలోని ప్రతిపక్షాలు ప్రముఖులు మండిపడ్డారు. ఇప్పటికీ అంతటా ఇదే రచ్చ కొనసాగుతోంది. మోదీ మాత్రం సెలెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఇప్పటికి వచ్చి దీనిపై ప్రత్యేకంగా మాట్లాడక పోవడం హాట్ టాపిక్ గా మారింది.
పలు వివాదాలు, ఆందోళనలు కొనసాగుతుండగానే.. పలు బిల్లులు పార్లమెంట్ లో ఆమోదం పొందుతున్నాయి. దివాలా, ఖాయిలా కోడ్ (సవరణ) బిల్లు, రాజ్యసభలో బాలల న్యాయ సంరక్షణ సవరణ వంటి బిల్లులు ఎటువంటి చర్చా లేకుండానే ఆమోదం పొందాయి. లోక్ సభలో అనుబంధ పద్దులకు కూడా ఆమోదం లభించింది. అయితే, పలు అంశాలపై ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఇష్యూతోనైనా ఎంత గగ్గోలు పెట్టినా సరే మోదీ మౌనం గా చూస్తున్నారు. ఆయన వ్యవహారశైలినే చాలా విచిత్రంగా ఉంటోందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.
గడిచిన 10 రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో ఈ పెగాసస్ వ్యవహారం అట్టుడుకుతోంది. రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు దీనిపై పెద్ద రచ్చ చేస్తున్నారు. మోదీపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ఒక్క ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయలేదు. పెగాసస్ ద్వారా మొబైల్ ఫోన్ ట్యాపింగ్ అన్నది మోదీకి తెలియకుండా జరిగే అవకాశమే లేదని, పైగా సాఫ్ట్ వేర్ కొనుగోలుకు కేంద్రం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చుపెట్టిందని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఇంత గోల జరుగుతున్న మోడీ మాత్రం పార్లమెంట్ లో ఎందుకు నోరు విప్పడం లేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.
అయితే, ఇప్పుడే కాదు.. గతంలోని పలు అంశాల్లో కూడా మోదీ స్పందించలేదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం వంటి అంశాలపై రచ్చ జరిగిన సందర్భంలో కూడా మొదీ అంతగా స్పందించ లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి చేయాలనుకున్న దాన్ని అమలు చేయడం, విమర్శలను పట్టించుకోకుండా తన పని చేసుకుపోవడం మోదీ తీరుగా భావిస్తున్నారు. పెగాసస్ వ్యవహారం పై మోదీ స్వయంగా స్పందించకపోయినా, ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టిగా బదులివ్వాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. సభలో విపక్షాలు సృష్టిస్తున్న గందర గోళాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని కూడా చెప్పినట్లు తెలిసింది. దీన్నిబట్టి మోదీ మౌనం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.