సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియాలో డ్రగ్స్ విషయమై చేసిన పోస్టింగ్ ఇప్పుడు పెను సంచలనానికి కారణమయ్యింది. నిజానికి మాధవీలత చెప్పింది కొత్త విషయం కాదు. పాత విషయమే. కానీ, బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణం తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘డ్రగ్స్ ఎపిసోడ్’ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి సీబీఐ సహా ఈడీ, నార్కోటిక్స్ విచారణ జరుగుతుండగా, టాలీవుడ్‌లోనూ అలాంటి విచారణ జరగాలంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు.. అని మాధవీలత చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నా, పైకి చెప్పలేని పరిస్థితి.
టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం గురించి గతంలోనే ఆరోపణలు వచ్చాయి. కొందరిపై విచారణ కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా ఆ కేసు నీరుగారిపోయింది. దాన్నే మాధవీలత ఇంకోసారి గట్టిగా ప్రస్తావిస్తూ కొన్ని అనుమానాలూ లేవనెత్తింది. అయితే, ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చి మాధవీలత మరింత ఘాటుగా తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడం గమనార్హం. ‘నేనేమీ కొత్తగా ఈ విషయం చెప్పడంలేదు. గట్టిగా చెబుతున్నానంతే..’ అని చెప్పిన మాధవీలత, సంచలనాల కోసం తాను ఇవన్నీ చేయడంలేదనీ, టాలీవుడ్‌కి మంచి జరగాలని మాత్రమే ఆశిస్తున్నానని పేర్కొంది. ‘నన్ను కొందరు దూషిస్తున్నారు సోషల్ మీడియాలో. నన్ను విమర్శించినంతమాత్రాన నిజం అబద్ధమైపోదు కదా..’ అని ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాధవీలత చెప్పింది.