iDreamPost
android-app
ios-app

కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేసేనా?

కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేసేనా?

ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. ఎమ్మెల్సీ అయిపోయారు. కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఇక అయిపోయిన‌ట్లే.. సుమారు న‌ల‌భై రోజుల క్రితం ఈ ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ.. నెల‌న్న‌ర అవుతున్నా కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీపై ఎటువంటి క్లారీటీ లేదు. ఏమైందీ.. అన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై చేసిన వ్యాఖ్య‌లు కొత్త త‌ర‌హా చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

ఆగ‌స్టు ఒక‌టిన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ హుజూరాబాద్ నేత‌ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌ కోటాలో శాసన మండలికి నామినేట్ చేసింది. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్‌ కావడం ఆనాడు టీఆర్‌ఎస్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్‌ ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గత నెల 23న నియమించారు. దీంతో కౌశిక్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ కావ‌డం లాంఛ‌న‌మే అని అంతా అనుకున్నారు. అయితే, ఇది జ‌రిగి నెల రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇంకా ఎటువంటి నిర్ణ‌య‌మూ వెలువ‌డ‌క‌పోవ‌డంతో అస‌లు కౌశిక్ ఫైలు రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లిందా అనే అనుమానాలు కూడా త‌లెత్తాయి. అయితే, గ‌వ‌ర్న‌ర్ తాజా వ్యాఖ్య‌ల‌తో ఆ విష‌యం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలిసినా, ఆమోదం పొందుతుందా, లేదా అనే సందేహాన్ని లేవ‌నెత్తుతున్నాయి.

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లు గవర్నర్‌గా పూర్తి చేసుకున్న ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇదే సంద‌ర్భంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పై కూడా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు. ఆ ఫైలు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేరి దాదాపు నెలన్న‌ర అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా ఆలోచిస్తాం అని చెప్ప‌డం ఉత్కంఠ‌గా మారింది.

మ‌రో విష‌యం ఏంటంటే.. సామాజిక సేవా విభాగంలో పంపినట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.. కౌశిక్ రెడ్డి క్రికెట్ కూడా కావ‌డం వ‌ల్ల స్పోర్ట్స్ కోటాలో పంపిన‌ట్లు గ‌తంలో ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలో అంతా గంద‌ర‌గోళంగా మారింది. ఏదేమైనా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తార‌నుకున్న కౌశిక్ రెడ్డికి.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ప‌ది రోజుల‌కే కేసీఆర్ ఎమ్మెల్సీ ప్ర‌క‌టించినా, ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.