iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికలో ఎందుకింత స్లో?

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికలో ఎందుకింత స్లో?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌లు ఓ లెక్క‌.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ లెక్క‌గా టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ ఎలాగైనా గెలిచి త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ భారీగానే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ సానుభూతి, స్థానికంగా ఆయ‌న‌కున్న ప‌ర‌ప‌తిని చిత్తు చేసేలా ఎత్తులు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కూ అభ్య‌ర్థి ఎంపిక కొలిక్కిరాలేదు. రాష్ట్రంలో ఎంతో బ‌లంగా ఉన్న టీఆర్ఎస్.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని తెలుస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అందుకు సరైన అభ్యర్థిని ఎంచుకునే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. బలమైన బీసీ నేత కావడంతో రమణను టీడీపీ నుంచి లాక్కొని కారెక్కించుకున్నారు. దీంతో హుజూరాబాద్లో ఆయనను పోటీగా నిలిపే అవకాశాలున్నట్లు వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తన కూతురు కవితను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేయించేందుకు వీలుగా అక్కడ బలమున్న రమణను పార్టీలోకి తీసుకున్నారని ఆయనకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే కట్టబెట్టే ఛాన్సుందని మరో వర్గం అంటోంది.

ఇక టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి మాట్లాడిన కాల్ లీక్ సంచలనంగా మారింది. దీంతో కౌశిక్ వైపు టీఆర్ఎస్ మొగ్గుచూపుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా కౌశిక్ తో కేటీఆర్ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్లో ఏ అభ్యర్థిని నిలబెడితే విజయం దక్కుతుందోనని రహస్యంగా సర్వేలు చేయిస్తున్న కేసీఆర్ ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

టీఆర్ఎస్ కు ఇప్ప‌టి వ‌ర‌కు హుజూరాబాద్లో తిరుగే లేదు. అక్కడ ఈట‌ల గెలుస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తుండడంతో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కేసీఆర్ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మంత్రులను ఇతర నాయకులను హుజూరాబాద్లో దింపిన ఆయన అక్కడి స్థానిక నేతలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఉద్యమ పురిటి గడ్డ హుజూరాబాద్ లో ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులకు ఎదగకుండా చేయడం ఆ పార్టీకి ఇప్పుడు మైన‌స్ గా మారింది.

దీంతో బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని లాగే ప్రయత్నంతో పాటు హుస్నాబాద్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిపై కేసీఆర్ ఆసక్తి చూపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ కు చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, కడియం శ్రీహరి టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ల పేర్ల పైనా చర్చ జరిగినట్లు సమాచారం. టీఆర్ఎస్ లో చేర్చుకున్న టీడీపీ దివంగత నేత దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. కానీ, ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ కు ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి ఉరుకులు పెట్టాల్సింది పోయి ఇప్ప‌టికీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.