iDreamPost
android-app
ios-app

మార్చి 14 వరకు అంతేనా?

  • Published Feb 01, 2022 | 1:17 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
మార్చి 14 వరకు అంతేనా?

ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన పనితీరుతో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆవిర్భావం నుంచి పొత్తుల వైపే మొగ్గుచూపుతూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదనే విమర్శను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బీజేపీతో మిత్రుత్వం కొనసాగిస్తున్న జనసేన వచ్చే 2024 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు కొనసాగిస్తుందా? తెలుగుదేశం పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా? ఒకవేళ సాధ్యమైతే 2014లో మాదిరి రెండింటితోనూ కలసి పయనిస్తుందా? అన్న ప్రశ్నలు, సందేహాలు అటు పార్టీ కేడర్‌లోనే కాక సామాన్యులలో సైతం కలుగుతున్నాయి. ‘వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి పార్టీ నాయకులు ఎవరూ స్పందించవద్దు. పార్టీలో అందరినీ సంప్రదించాక నిర్ణయం తీసుకుందాం. ఈ విషయంపై పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్ణయం తీసుకుందాం. ఈలోపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారిద్దాం’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆ మధ్య ప్రకటించారు. దాంతో పార్టీల మధ్య పొత్తులపై రాష్ట్రంలో జరిగిన చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది.

టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసం అటు బీజేపీ వైపు, ఇటు జనసేన వైపు ఆశగా చూస్తుండడం, మీడియాలో పొత్తులపై చర్చోపచర్చలు సాగుతుండడంతో పవన్‌కల్యాణ్‌ అలా ప్రకటించారు. కానీ నిజానికి ఇప్పటికిప్పుడు పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయితే ఏ ఎన్నికలూ లేని సమయంలో అంటే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జనసేన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి ఆ కూటమిలో కలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో జనసేనపైనే గంపెడాశలు పెట్టుకున్నారు.

జనం సమస్యలపై స్పందించారా?

పొత్తుల మాట అలా ఉంచితే ఒక రాజకీయ పార్టీగా జనసేన క్రియాశీలకంగా పనిచేస్తోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో జరిగే రోజువారీ ఘటనలపైన, ప్రభుత్వ విధానాలపైన అటు టీడీపీ, ఇటు బీజేపీ, వామపక్షాలు తక్షణం స్పందిస్తుంటాయి. సభలో, సదస్సులో, ఆందోళనో నిర్వహించి జనం దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుంటాయి. రాజకీయ పార్టీల ఉనికి కోసం అలా వ్యవహరించడం సాధారణం. అయ్య వచ్చినప్పుడే అమావాస్య అన్నట్టు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఎప్పుడు సమయం దొరికి బయటకు వస్తారో అప్పుడే పార్టీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. 20 రోజులకో, నెల్లాళ్లకో ఆయన వచ్చి ఏదో ఒక సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వడమో, ఆందోళన చేయడమో ఉంటుంది. తర్వాత మళ్లీ పార్టీ సైలెంట్‌ అయిపోతోంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని రాజమహేంద్రవరంలో ఒకసారి ఆందోళన, ఆ తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ ముందు అక్టోబర్‌ 31న బహిరంగ సభ,  ఓ 40 రోజుల తర్వాత అమరావతిలో కొన్ని గంటల దీక్ష ఇలా కాల్షీట్‌లను బట్టి ఆందోళనలు చేస్తున్నారు. తర్వాత ఆ సమస్యల గురించి కనీసం పార్టీ తరఫున కూడా ఎవరూ మాట్లాడడం లేదు.

ఆ మధ్య నాదెండ్ల మనోహర్‌ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసమంటూ జిల్లాలో పర్యటించినప్పుడు స్థానిక సమస్యలపై స్పందించేవారు. అంతకుమించి రాష్ట్రంలో జనసేన పార్టీ జనం సమస్యలపై కనీసం స్పందించడం లేదు అన్న ఇమేజ్‌ను తెచ్చుకుంది. పాతికేళ్లు రాజకీయాలు చేద్దామని పార్టీని స్థాపించినట్టు పవన్‌కల్యాణ్‌ చెబుతుంటారు. పార్టీ స్థాపించి ఏడేళ్లు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్లు అయినా ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలవడం తప్ప పార్టీకి ఒక ఊపు తీసుకురాలేకపోయారు. ఇదే వేగంతో పనిచేస్తే ఎన్నేళ్లకు ఆ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుంది అన్న ప్రశ్న ఆ పార్టీ కేడర్‌ను, అభిమానులను తొలిచేస్తోంది.