Idream media
Idream media
ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయనే సామెతను సంపద విషయంలోనే కాదు.. పరువు ప్రతిష్టల విషయంలోనూ ప్రయోగిస్తే.. మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవచ్చు. మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పే స్థాయి నుంచి.. నారాయణ విద్యాసంస్థల పేరుతో తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్ర వేసి, నేడు మోసగాడు అంటూ ప్రజలు చర్చించుకునే వరకూ నారాయణ ప్రస్థానం సాగింది.
ప్రైవేటు విద్యా వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, స్థాయిని నారాయణ సంపాదించుకున్నారు. ఇంటర్ కాలేజీల నుంచి పాఠశాల విద్య, మెడికల్, ఇంజనీరింగ్‌లలో ప్రవేశ పరీక్షలకు శిక్షణ.. వరకు నారాయణది ప్రత్యేక స్థానం. విద్యా వ్యవస్థలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న నారాయణ.. దానికి మకుటం లేని మహరాజు అయ్యారు.
నాడు మహారాజుగా వెలుగొందిన నారాయణ.. ఇప్పుడు మోసగాడు అనే అపప్రథను మూటకట్టుకుంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో.. చట్టసభల్లో సభ్యుడుగా లేని నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2014లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ నారాయణ ఏ రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఏ పార్టీతోనూ బహిరంగ సంబంధాలు కొనసాగించలేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే.. టీడీపీలో నారాయణ ఎలాంటి పాత్ర పోషించరో ఎవరికి వారు విశ్లేషణలు చేశారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంధనాన్ని నారాయణ సమకూర్చారనే చర్చ సాగింది.
Also Read : మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు
సమయానుకూలంగా ధనవంతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చే చంద్రబాబు.. నారాయణను తెర వెనుక ఉంచి ఆయన సేవలు పొందారు. అందుకు ప్రతిఫలంగా తన కేబినెట్‌లో కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణను నియమించారు. దీనితోపాటు.. నూతన రాజధాని అమరావతి విషయంలో అన్ని బాధ్యతలు నారాయణకే అప్పజెప్పారు. పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా లాభాలు ఆశించిన నారాయణ.. అమరావతి ప్రాంతంలో భూ దందాకు పాల్పడ్డారనే అరోపణలు వెల్లువెత్తాయి. నారాయణ చేసిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అమరావతి ప్రాంతంలో జరిగిన భూ దందాలో నారాయణదే కీలక పాత్ర అని అప్పటి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఇటీవల సీఐడీకి వాగ్మూలం ఇచ్చారనే వార్తలు సంచలనం కలిగించాయి. భూములును తన సంస్థలలో పని చేసే ఉద్యోగుల పేరుతో కొనుగోలు చేయించడం నుంచి వాటిని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇవ్వడం వరకూ నారాయణ దందా యథేచ్ఛగా సాగింది.
టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నుంచి నారాయణ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. 2019లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ మంత్రి అనిల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఒక సారి అమరావతి భూ దందాపై వచ్చిన ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిన నారాయణ.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఈ రెండేళ్లలో ఒకేఒకసారి ఆయన బయట కనిపించారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా సీఆర్‌డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఇచ్చిన వాగ్మూలంలో నారాయణే భూ దందాలో సూత్రధారి, పాత్రధారి అని వార్తలు వెలువడినా.. వాటిని ఖండించేందుకు, వివరణ ఇచ్చేందుకు కూడా నారాయణ బయటకు రాలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం కూడా తెలియదు. నాడు దొర మాదిరిగా బతికిన నారాయణ.. నేడు దొంగ మాదిరిగా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఉండడం.. కింకరుడే రాజగున్.. రాజే కింకరుడగున్.. అన్న సత్యహరిచ్ఛంద్రుడి మాటలను గుర్తుకు తెస్తున్నాయి.
Also Read : ఇంతకీ నారాయణ ఎక్కడ?