iDreamPost
android-app
ios-app

అప్పులపై శ్వేతపత్రం అడగొచ్చు కదా..?

అప్పులపై శ్వేతపత్రం అడగొచ్చు కదా..?

తప్పులెన్నువారు తమతప్పులెరగరన్నట్లుగా ఉంది టీడీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీరు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందన్నారాయన. మార్కెట్‌ లోన్స్‌ కంటే ఆఫ్‌ బడ్జెట్స్‌ లోన్‌ ఎక్కువగా తీసుకుంటున్నారని సామాన్య ప్రజలకు అర్థం కాని పదాలతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేదలకు సంక్షేమాన్ని సాకుగా చూపి.. వారి నెత్తిన అప్పు భారం పెంచుతారా..? అని నిలదీశారు. ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పులతో ఎన్నాళ్లు పాలన సాగిస్తారని కూడా యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని దివాళీ తీయిస్తోందంటున్న యనమల రామకృష్ణుడు.. ఒక వేళ అదే జరిగితే.. దానికి కారణం ఎవరు..? రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటాగా వచ్చిన అప్పు మొత్తం దాదాపు 90 వేల కోట్ల రూపాయలు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి, 2019లో దిగిపోయే సమయానికి ఉన్న రాష్ట్ర అప్పు దాదాపు  2.50 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా దాదాపు 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. 58 ఏళ్లలో వివిధ పార్టీల ప్రభుత్వాలు 90 వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వ కేవలం ఐదేళ్లలో 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. రాష్ట్ర దివాళా తీస్తోందంటున్న యనమల రామకృష్ణుడే నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మరి.

అవకాశం ఉంది కాబట్టే అప్పులు చేస్తున్నాం అంటూ నిర్మోహమాటంగా ఆర్థిక మంత్రి హోదాలో నాడు యనలమ రామకృష్ణుడు చెప్పారు. అందినకాడికి ఎడాపెడా అప్పులు చేసి.. నేడు అప్పులు చేస్తున్నారంటూ యనమల మాట్లాడుతున్నారు. తాము చేసిన 1.50 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ, అసలు ఎవరు కట్టాలి. వాస్తవాలను మరిచి విమర్శలు చేస్తున్న యనమల.. తాము అప్పులు చేశామనే విషయాన్ని మరచిపోతున్నట్లుగా ఉంది. ఆదాయ మార్గాలను పెంచకుండా, అప్పులు ద్వారా ఎన్నాళ్లు నడిపిస్తారంటున్న యనమల.. తమ హాయంలో ఆదాయాలు పెంచే.. ఏడాదికి సరాసరి 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారా..? అంటే ఏం చెబుతారు. ప్రెస్‌మీట్లు, ప్రెస్‌నోట్ల ద్వారా అప్పులు, ఆదాయాలు అంటూ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న యనమల.. ఒక్కసారి ఏపీ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేయొచ్చు కదా..? ఆ పని ఎందుకు చేయరో..?

Also Read : కామన్ అయినా ప్రత్యేకమైనా అవి కాపులకు ఇస్తున్నవే కదా!