ఇటీవలి కాలంలో టీఎంసీలోకి వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి రాజకీయ వలసలు ఊపందుకోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సారధ్యంలో విపక్షాలు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే చేరికలు పెరగడంతో మమత పేరు దేశరాజకీయాల్లో మోదీకి సమానంగా మార్మోగుతోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పార్టీ వెస్ట్ బెంగాల్‌లో మూడోసారి విజయం సాధించిన తర్వాత ఆమె దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళా నేతగా ఎదిగారు. వివిధ దేశాధినేతలు పాల్గొనే రోమ్ ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం రావడం మమతా బలాన్ని తెలియజేస్తోంది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను మమత స్థాపించి రాజకీయంగా ఎన్నో విజయాలను మమతా బెనర్జీ అందుకున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ(మాతృపార్టీ) నుంచే టీఎంసీలోకి ఎక్కువ చేరికలు జరుగుతుండటం చెప్పుకోదగిన విషయం. ఇక కాంగ్రెస్ పార్టీ చతికిలపడిపోయిందని బీజేపీని ఎదుర్కొనే సత్తా టీఎంసీకే ఉందనే ప్రచారం సాగుతోంది. బీజేపీకి సరైన పోటీ ఇచ్చే నేతలు కాంగ్రెస్‌లో లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే భావన కూడా పెరగడంతో ఆ పార్టీ నుంచి టీఎంసీలోకి వలసలు పెరిగాయి.
Also Read : వైఎస్సార్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు..? కేంద్ర మాజీ మంత్రి వ్యాఖ్యల్లో నిజమెంత..?
రాజకీయాల్లో దూకుడుగా ఉండే మమత, ప్రత్యర్థులకు ధీటుగా సమాధానమిస్తారు. దూకుడు రాజకీయాలతో ఎన్నో విజయాలు సాధించారు.పశ్చిమబెంగాల్‌లో హ్యాట్రిక్ సాధించిన టీఎంసీ ప్రభుత్వం ఇక ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సిద్ధమైంది. ప్రజాదరణ ఉన్న నాయకులకు ఆయా రాష్ట్రాల బాధ్యతలు కట్టబెడుతున్న టీఎంసీ అధిష్టానం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ లోక్ సభ స్థానాలు కైవసం చేసుకునేలా అడుగులు వేస్తుంది.
బీజేపీ యేతర కూటమిగా విపక్షాలు ఏర్పడితే అందులో టీఎంసీ కీలక శక్తిగా ఉంటుందనడంలో సందేహం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మమతనే బీజేపీ యేతర కూటమి పీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై టీఎంసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దేశంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి సరైన పోటీ ఇచ్చే సత్తా మమతకే ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు కొంతమంది టీఎంసీ గూటికి చేరుతున్నారు. దీంతో వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది.
పెరిగిన వలసలు..
అస్సాం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుస్మిత, టీఎంసీలో చేరగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు టీఎంసీ అస్సాం, త్రిపుర శాఖల బాధ్యతలు అప్పగించారు. గోవా మాజీ సీఎం, ఫలేరో కూడా కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. బీజేపీని ఎదుర్కునే శక్తి మమతకు మాత్రమే ఉందని ఆయన నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దేశానికి మమత లాంటి నేత అవసరమని అభిప్రాయపడిన ఫలేరో… ఎలాంటి పొత్తులు లేకుండానే గోవాలో టీఎంసీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : గుండు కొట్టించుకొని ,పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఇక మేఘాలయలో కూడా మాజీ సీఎం ముకుల్ సంగ్మా, టీఎంసీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరిగింది. దీంతో ముకల్ సంగ్మాను రాహుల్ బుజ్జగించారు. మేఘాలయ కాంగ్రెస్ చీఫ్ గా విన్సెంట్ పాల్ నియమించినప్పటి నుంచి కాంగ్రెస్ పై సంగ్మా గుర్రుగా ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీలో సంక్షోభమున్నా దానిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తుంది
త్రిపురలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ కూడా టీఎంసీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని వీడుతున్న సందర్భంగా ఆ పార్టీలో ఉన్నందుకు పరిహారంగా గుండుకొట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజకీయ విజయాలు..
కాంగ్రెస్‌తో విబేధించి 1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(AITMC)ను స్థాపించిన మమత, అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేశారు. 2011లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మొండిమనిషిగా పేరున్న మమత అత్యంత సాదాసీదా జీవితం గడుపుతారు. 2004లో టీఎంసీ నుంచి ఆమె ఒక్కరే ఎంపీగా గెలిచారు. 2019లో లోక్ సభలో టీఎంసీ బలం 19 కి చేరింది. ప్రస్తుతం టీఎంసీ లోక్ సభలో నాల్గో అతిపెద్ద పార్టీగా ఉంది.
Also Read : యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన