iDreamPost
android-app
ios-app

దివాకర్ వల్ల జైలు పాలైతే..అందులో చిరంజీవిని ఎందుకు లాగుతారు : సుమన్

దివాకర్ వల్ల జైలు పాలైతే..అందులో చిరంజీవిని ఎందుకు లాగుతారు : సుమన్

హీరో సుమన్ జైలుకెళ్ళడం అన్న ఎపిసోడ్ చాలా ముసలదైపోయింది. అయినా ఎప్పటికప్పుడు అది ఫ్రెష్ గానే ఫైల్లో టాప్లో ఉంటుంది. సుమన్ కూడా విసుక్కోకుండా అదెలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు కారణం అనే విషయాలను తీరిగ్గా, పూస గుచ్చినట్టు చెబుతారు. ఈ మధ్య మళ్ళీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఇంత వరకూ ఎవ్వరికీ చెప్పని కొత్త విషయం చెప్పారు. తనకి ఏమీ తెలియకుండానే, ఎలా కేసులో బుక్ అయిపోయాడన్నది రివీల్ చేశారు.

వీడియో క్యాసెట్లు కొత్తగా వస్తున్న రోజులవి. తాను కరాటే, కుంఫూ వంటి ఫైట్స్ మీద బాగా ఇంట్రస్ట్ ఉన్నవాడిగా ఓ వీడియో పార్లర్కి తరచూ వెళ్ళి, ఆ సదరు క్యాసెట్లు తెచ్చుకుని చూడటం రెగ్యులర్ హేబిట్ గా మారిపోయింది, ఆ ప్రాసెస్లో ఆ వీడియో పార్లర్ నడిపే దివాకర్ అనే వ్యక్తితో సుమన్ కు పరిచయం పెరిగి, దివాకర్ ఫ్యామిలీ ఫ్రెండ్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఎంత రేంజ్ అంటే..సుమన్ షూటింగ్ వెళ్తే, ఇంట్లో కారుని సైతం, సుమన్ తల్లిని అడిగితీసుకుపోయేంత రేంజ్ అనమాట. సుమన్ మదర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఆమె ఓ కాలేజ్ ప్రిన్సిపల్. ఆమె దగ్గర చదువుకున్న వ్యక్తే కరుణానిధి కూతురు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సిస్టర్ కనిమొళి. తమిళనాడు ఒకనాటి గవర్నర్ పిసి అలెగ్టాండర్, సుమన్ మదర్ కలసి చదువుకున్న నేపథ్యం కూడా ఉంది.

ఇదిలా ఉండగా, ఈ దివాకర్ అన్న వ్యక్తి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి మద్రాసులో అప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీకి చెందింది. వాళ్ళ ప్రేమాయణం కాస్తంత బైట పడింది. నిఘా పెరిగింది. సినిమాల్లో చూపించినట్టుగా ప్రతీచోటా మనుషులు, ఆ పెద్ద ప్యామిలీ ఫాలోయర్స్ ఎక్కడ పడితే అక్కడ మద్రాసు అంతా కుప్పలు తెప్పలుగా ఉన్న పరిస్థితి. ఇదిలా జరుగుతుండగా ఒకరోజు సుమన్ షూటింగ్ కోసమని వెళిపోతే, ఈ దివాకర్ అన్నవ్యక్తి, నేరుగా సుమన్ ఇంటికి వెళ్ళి, సుమన్ మదర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ కారు తీసుకెళ్ళాడు. ఆ కారులో ప్రేమికురాలిని ఎక్కించుకుని ఉడాయిస్తున్న టైంలో ఆ అమ్మాయి ఫామిలీ ఫాలోయర్స్ చూశారు. అమ్మాయి గురించి వెతికారు. కనబడకపోయేసరికి ఏ కారులో అయితే అమ్మాయిని చూశారో, ఆ కారు ఎవరిదీ అన్న విషయంపై ఆరా తీశారు. ఆరా తీయగా ఆ కారు సుమన్ అనే వ్యక్తిది అని తెలిసింది, అప్పుడప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నవాడిగా వాళ్ళు సమాచారం సేకరించారు.

దివాకర్ ప్రేమికురాలి ఫ్యామిలీ కరెక్టుగా సినిమాల్లో చూపించేలాంటి రిచ్ ఫ్యామిలీ. బోలెడంత రాజకీయ పలుకుబడి. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఇలా అనమాట. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి సుమన్ అనే వ్యక్తే వాళ్ళ పిల్లని తీసుకుపోయాడనే ఆలోచనతో సుమన్ని దెబ్బతీయడానికి, మళ్ళీ కోలుకోకుండా భూస్థాపితం చేసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా బ్లూఫిల్ములు తీస్తున్నాడని నేరం బనాయించి, సుమన్ని అడ్డంగా బుక్ చేసేశారు. ఏకంగా జైల్లో తీసుకెళ్ళి పడేశారు. దేశం మొత్తం మీద పెద్ద పెద్ద లాయర్లు అందరూ పూనుకున్నా సరే సుమన్ విడుదల కాలేదు. ఎవ్వరూ విడిపించలేకపోయారు. ఎన్ని సాక్ష్యాలు సుమన్ కి పేవరబుల్గా ఉన్నా సరే సుమన్ జైలు కూడు తినవలసి వచ్చింది.

అప్పుడు ఏదో కారణం మీద కరుణానిధిని సుమన్ ఉన్న జైలులోనే ఉంచాల్సి వచ్చింది. స్పెషల్ కస్టడీ సెల్ అది. సుమన్ ఎందుకు అంత స్పెషల్ సెల్లో ఉండాల్పి వచ్చిందని కరుణానిధి గొడవ మొదలు పెడితే కొంత మోక్షం లభించింది సుమన్ కి. తర్వాత కొన్ని రోజులకి సిసి అలెగ్జాండర్ తమిళనాడు గవర్నర్ పదవిని అలంకరించిన దరిమిలా సుమన్ తల్లి తన సహ విద్యార్ధి అయిన అలగ్జాండర్ ని కలసి కేసు గురించి వివరించి, న్యాయం చేయమని అడిగితే అలెగ్టాండర్ కలుగుజేసుకుని అధికారులను పిలిచి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నీళ్ళు నమిలారు. పైనుంచి ఒత్తిళ్ళున్నట్టు ఒప్పుకున్నారు. ఇంత జరిగితే గానీ సుమన్ కి పూర్తిగా మోక్షం దొరకలేదు.

ఈ ఉదంతం మొత్తాన్ని సుమన్ ఐ ఢ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ దివాకర్ అన్నవాడు మళ్ళీ నాకు కనిపించలేదు. కలవలేదు. నేను మాత్రం వాడు చేసిన పనికి పూర్తిగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇందులో చిరంజీవిని ఎందుకు లాగుతారో, అయనకేదో ఇందులో ప్రమేయం ఉన్నట్టు ఎందకు రాద్ధాంతం చేస్తారో నాకు అర్ధం కాదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఆయనకి ఏ పాపం పుణ్యం తెలియదు. ఆయనని అనవసరంగా, అకారణంగా మధ్యలోకి లాగుతారు ఎప్పటికప్పుడు..అని సుమన్ తన మనసులో మాట మొదటిసారి చెప్పారు.

కేవలం సంచలనం కోసం నన్ను కూడా కలిపారు: మెగాస్టార్ చిరంజీవి
ఇదే విషయం మీద మొన్నీ మధ్య మీడియా సభ్యులతో ఇంటరాక్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఫీలయ్యారు. “అప్పుడే వ్యాస్ చంద్ అని ఓ జర్నలిస్టు నాపేరును కూడా ఇరికించి రాశారు. ఏంటండీ ఇది అని అడిగితే కాదని మీరు ఖండించండి, అది కూడా రాస్తాం అని చాలా తేలిగ్గా అనడం నన్ను చాలా బాధ పెట్టింది. కానీ మీడియాని ఏం చెయ్యగలం? ప్రతీ పుట్టినరోజుకి సుమన్ నేను విష్ చేసుకుంటాం. శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అంత మంచి స్నేహం మాది.” అని మెగాస్టర్ చెప్పారు.

                                                                                                                                                                                                                                  – నాగేంద్ర కుమార్