iDreamPost
android-app
ios-app

బాబు రాజకీయాలు.. పెదవి విరుస్తున్న తమ్ముళ్లు..

బాబు రాజకీయాలు.. పెదవి విరుస్తున్న తమ్ముళ్లు..

ఉద్యోగం చేసే వ్యక్తి తన పని ప్రాంతంలోనో, కార్యాలయానికి సమీపంలోనో ఉంటారు. వ్యాపారి తాను వ్యాపారం చేసే ప్రాంతంలో నివాసం ఉంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం సాఫీగా నడవాలంటే ఆ ప్రాంతంలో ఉండడం ఎంతో ముఖ్యం. ఇది మౌలిక సూత్రం. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా లేదా మరేపనైనా సరే ఆయా పనులు చేసే ప్రాంతంలో ఉంటేనే కార్యాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకొవచ్చు. ఇంతటి ప్రధానమైన, మౌలిక సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విస్మరిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన నివాసానికి, చేసే పనికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదని తెలుగు తమ్ముళ్లే పెదవివిరుస్తున్నారు.

చుట్టంచూపు రాజకీయాలు..

చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌తో కలసి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రాజకీయపరమైన కార్యక్రమాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. సదరు కార్యక్రమం జరిగే ప్రాంతానికి హైదరాబాద్‌ నుంచి వచ్చి.. మళ్లీ వెళ్లిపోతున్నారు. కార్యక్రమాల కోసం వచ్చిన వారు.. అవి ముగిసిన వెంటనే వెళ్లిపోతుండడంతో తమ్ముళ్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏదైనా అవసరం పడి అధినేత చంద్రబాబును లేదా చిన్న అధినేత లోకేష్‌ను కలవాలంటే అవకాశం లేకుండాపోతోందనేది తమ్ముళ్ల బాధ. ఆంధ్రప్రదేశ్‌లో ఉండేందుకు చంద్రబాబుకు శాశ్వత నివాసం అంటూ ఇప్పటికీ లేదు. కృష్ణా కరకట్ట వెంబడి లింగమనేని గెస్ట్‌ హౌస్‌నే ఇప్పటికీ తన నివాసంగా చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. ఈ విషయం కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. నిత్యం అమరావతి గురించి మాట్లాడే చంద్రబాబుకు ఏపీ రాజధానిలో ఇళ్లులేని విషయం వైసీపీకి విమర్శనాస్త్రంగా మారుతోంది. ఇంకా ఎన్నాళ్లిలా చుట్టంచూపు రాజకీయాలు చేస్తారని తమ్ముళ్లు మధనపడుతున్నారు.

జెండా వందనం కూడా తెలంగాణలోనే…

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత. ముఖ్యమంత్రితో సమానమైన బాధ్యతలు ఉంటాయి. కానీ చంద్రబాబు మాత్రం అత్యవసరం అయితేనే ఏపీకి వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు లోకేష్‌ను పంపిస్తున్నారు. పంద్రాగస్టు రోజున జెండా వందనం కోసం కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు రాలేదు. ప్రతిపక్ష నేతలు.. తమ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి, వందనం సమర్పించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని తన నివాసంలో కుమారుడు, మనవడితో కలసి కానిచ్చారు. అక్కడ నుంచే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దోపిడీపై నిరంతరం పోరాడదామన్నారు. జాతియోధ్యమ స్ఫూర్తితో పోరాడి సమాజాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. జూమ్‌లో పార్టీ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, ఉద్యమాలు, ఆన్‌లైన్‌ నిరసనలు తెలిపే చంద్రబాబు.. ఇంకా ఎన్నాళ్లిలా ఏపీకి రాకుండా రాజకీయాలు చేస్తారనే ప్రశ్న తమ్ముళ్ల మెదళ్లను తొలిచివేస్తోంది. బాబు ఏపీలో ఎప్పటి నుంచి శాశ్వత నివాసం ఉంటారో.. తమ్ముళ్ల బాధ ఎప్పటికి తీరునో..? కాలమే చెప్పాలి. 

Also Read : సోము నోట.. చాన్నాళ్లకు ఆ మాట..!