Idream media
Idream media
కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తమ్ముళ్ల మధ్య చర్చ సాగుతోంది. పార్టీ నేతలపై కేసులు నమోదైనప్పుడు, జైలుకు వెళ్లి వచ్చినప్పుడు వారికి అండగా.. ప్రకటనలు, పరామర్శలు చేసే చంద్రబాబు.. భూమా అఖిల ప్రియ ఉదంతంపై మాత్రం స్పందించకపోవడం ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ ఘటన జరిగి రెండు రోజులయినా.. ఇప్పటి వరకూ చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ.. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించలేదు.
టీడీపీ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు 150 కోట్ల రూపాయల ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన సమయంలో బాబు అండగా నిలిచారు. అచ్చెం నాయుడు తప్పేమిలేదన్నట్లుగా మాట్లాడారు. ఫైల్స్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో పరమార్శకు వెళ్లారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత అచ్చెం నాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరో నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. హత్య కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు రవీంద్రకు అండగా ప్రకటనలు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఫోర్జరీ పత్రాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలోనూ, జైలు నుంచి విడుదలైన సమయంలోనూ నారా లోకేష్ తాడిపత్రిలోని వారి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చారు. అయితే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియకు మాత్రం ఈ తరహా అండ, భరోసా చంద్రబాబు, లోకేష్‌ల నుంచి లభించకపోవడంపై తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.
పార్టీకి ఉపయోగపడతారు, బలమైన నేతలైతే ఒకలా.. అందుకు భిన్నంగా ఉంటే.. మరోలా ప్రవర్తించడం బాబు నైజమని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. రాయలసీమకు చెందిన ఇద్దరు నేతలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ ఉందంతాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి బలమైన క్యాడర్, కుటుంబ నేపథ్యం ఉంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత.. వారి వర్గం బలహీనపడింది. గత ఎన్నికల్లో అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డల్లో భూమా వారసులు ఇద్దరూ ఓటమి పాలైన తర్వాత.. ఇక అఖిల వల్ల ప్రయోజనం లేదనే భావనకు చంద్రబాబు వచ్చారని, అందుకే అఖిల అరెస్ట్ విషయంపై కనీసం ట్విట్టర్‌లోనైనా స్పందించలేదని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు మౌనానికి మరో కారణం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అఖిల హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. పైగా ఈ కిడ్నాప్ కేసులో బాధితులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సమీప బంధువలు కావడంతోనే బాబు మౌనం పాటిస్తున్నారంటున్నారు. 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోగానీ, ఎన్నికలు, అక్కడ జరిగే ఏ ఘటనపై స్పందించడం లేదు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో పోటీ చేసినా.. హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబుగానీ, ఆయన కుమారుడు గానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు సరికదా.. పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చిన్న పాటి ప్రకటన కూడా జారీ చేయలేదు. ఇక ఓటు నోటు కేసులో నిందితుడుగా ఉన్న మత్తయ్య ఇటీవల అప్రువర్‌గా మారడంతో.. బాబుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బాబు చెబితేనే తాను నామినేటెడ్ ఎమ్మెల్యేస్టీఫెన్ సన్‌తో మాట్లాడానని, రేవంత్ అరెస్ట్ తర్వాత లోకేష్‌కు ఫోన్ చేస్తే.. ఏపీకి వచ్చి రక్షణ తీసుకోవాలని చెప్పాడంటూ మత్తయ్య బాంబ్ పేల్చారు. ఇప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబు ఒక్కడే అనుకుంటే.. మత్తయ్య వాగ్మూలం తర్వాత లోకేష్‌కు కూడా చిక్కులు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. అఖిల అరెస్ట్‌పై చంద్రబాబు మాట్లాడడంలేదనే చర్చ సాగుతోంది.