iDreamPost
iDreamPost
పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దాదాపు 34 ఏళ్ల పాటు నిరాటంకంగా పాలన సాగించిన ఘనత సీపీఎంది. ఆ పార్టీ తరుపున ఈ కాలమంతా ఇద్దరు మాత్రమే ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా అందులో జ్యోతిబసుది ప్రత్యేక శైలి. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనకు కీలకపాత్ర ఉంది. ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. చివరకు బుద్ధదేవ్ హయాంలోనే లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ కోలుకున్న దాఖలాలు లేవు. ఒకనాటి ఎర్రకోటగా భావించిన ప్రాంతంలో ఇప్పుడు ఆ పార్టీలు పరిమితమయిపోయాయి. పట్టుకోల్పోవడంతో తిరిగి సంపాదించడం కష్టంగా మారింది.

తాజాగా ఈ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పేరు తెరమీదకు వచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆయన పేరుండడమే కారణం. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన కాశ్మీరీ గులాం నబీ ఆజాద్ తదితరులతో పాటుగా బుద్ధదేవ్ కి కూడా కేంద్రం పద్మ అవార్డు ప్రకటించింది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించే సీపీఎం నాయకుడిని పద్మభూషణ్ తో సత్కరించడం ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటికీ గులాంనబీ పలు దఫాలు తన పార్టీని కూడా విమర్శిస్తూ మోదీని కొనియాడిన సందర్భాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రశంసించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఓ సందర్భంగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే బీజేపీనే ఆయనకు రాజ్యసభలో చోటు కల్పించే విషయం పరిశీలిస్తోందంటూ కథనాలు వచ్చాయి. ఈ తరుణంలో గులాంనబీని ఎంపిక చేయడంలో పెద్ద విశేషం కనిపించడం లేదు.
బుద్ధదేవ్ ఎంపికలో రాజకీయాలు మాత్రం సుస్పష్టం. బెంగాల్ లో బీజేపీ ఇటీవల కొంత పుంజుకుంది. 2021 ఎన్నికల్లో అధికారం కూడా ఆశించింది. కానీ సుదూరంగానే నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉండడంతో భవిష్యత్తు మీద గట్టి ఆశలతోనే సాగుతోంది. ఈ తరుణంలో ఇటీవల బీజేపీకి షిఫ్ట్ అయిన ఓటర్లలో అత్యధికులు లెఫ్ట్ పార్టీల ఓటర్లున్నారు. మమతా మీద వ్యతిరేకతతో ఆమెను ఇంటికి పంపించే శక్తి ఉన్న పార్టీగా బీజేపీని విశ్వసించారు. దాంతో వామపక్షాల పునాదులు కూడా చెల్లాచెదురయ్యి బీజేపీ వైపు మొగ్గుచూపడంతో దానిని బలపరుచుకునే పని బీజేపీ చేస్తోంది. మరోసారి ఈ ఓటుబ్యాంక్ టర్న్ కాకూడదని ఆశిస్తోంది. అందులో భాగంగానే సుభాష్ చంద్రబోస్ ని ఓ వైపు కీర్తిస్తూ బెంగాలీలను తృప్తి పరిచే పని సాగిస్తూనే బుద్ధదేవ్ ని సత్కరించడం ద్వారా తాము అవకాశం కల్పించామని చెప్పడానికి సాహసించినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి సీపీఎం నేతలు పద్మ అవార్డులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ పురష్కారాలను తిరస్కరించిన చరిత్ర ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఎత్తులే వేసింది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అన్నింటినీ వినియోగించుకోవడంలో పెద్ద విశేషం లేదు. అందులో పద్మ అవార్డులు కూడా భాగమేనన్నది సందేహం అవసరం ఉండదు. కేరళ సీఎంగా పనిచేసిన ఈఎంఎస్ నంబూద్రిపాద్ ని సైతం పద్మభూషణ్ తో సత్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిన సమయంలో ఆయన తిరస్కరించారు. తాను అవార్డులు తీసుకునేందుకు సైద్ధాంతికంగా వ్యతిరేకమని తెలిపారు. ప్రస్తుతం బుద్ధదేవ్ సైతం దానిని కొనసాగించారు. తాము ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామే తప్ప వ్యక్తికత ప్రోత్సాహకాల కోసం కాదంటూ ఆయన వెల్లడించారు. దాంతో మరోసారి ఆపార్టీ నిబద్ధతను బుద్ధదేవ్ చాటుకున్నట్టయ్యింది.
పద్మ అవార్డుల తిరస్కరణను గతంలో కూడా పలువురు నేతలు చేసినప్పటికీ తాజా వ్యవహారం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. కొందరు దానిని తప్పుబడుతున్నారు. కానీ బుద్ధదేవ్ మాత్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ఆసక్తికర పరిణామం అవుతోంది.