Idream media
Idream media
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి.. హుజూరాబాద్ ప్రజల ముందుకు వచ్చిన రాజేందర్.. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్న ఈటల రాజేందర్.. ఈ రోజు పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గంలోని 107 పంచాయతీలలోని 127 గ్రామాలను కవర్ చేసే విధంగా పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. 23 రోజుల పాటు దాదాపు 270 కిలోమీటర్ల మేర ఈటల రాజేందర్ పాదయాత్ర సాగబోతోంది. ఇందుకు కోసం ఆయన పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్ర సాగే రూట్‌లో దారి పొడవునా ఈటల రాజేందర్, బీజేపీ జెండాలను ఏర్పాటు చేశారు.
అటు వైపు చూడని బీజేపీ పెద్దలు..
ఉప ఎన్నికల ఫలితం ఈటల రాజేందర్‌కు చావో రేవో లాంటిది. ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య. అందుకే ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈటల సతీమణి కూడా రంగంలోకి దిగారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈటలను లైట్ తీసుకుంటున్నట్లుగా పరిణామాలు జరుగుతున్నాయి. నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా 23 రోజులు, 270 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న ఈటల.. ఈ రోజు నడక ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ పెద్దలు మాత్రం హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
Also Read : బీజేపీలోకి టీడీపీ విలీనం : కారణాలు చెప్పిన కొడాలి నాని
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చి ఉంటే.. ఈటల వర్గంలో జోష్ కనిపించేది. పార్లమెంట్ సమావేశాల కారణంగా వారు హాజరుకాలేకపోతున్నారని బీజేపీ నేతలు చెప్పుకున్నా.. ఎంపీలు కానీ నేతలు ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. వారు కూడా ఈ వైపు చూడలేదు. పాదయాత్ర ప్రారంభానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రావడం విశేషం. ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసిన నేత అయిన ఈటల రాజేందర్ పాదయాత్రను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు ప్రారంభించడం.. ఈటలకు బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తోందో అర్థమవుతోంది.
చేరిక నుంచి సీతకన్ను..
టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఈటల రాజేందర్ సొంతంగా పార్టీ పెడతారనే వార్తలొచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు.. తమ పార్టీలలో చేరాలని ఆహ్వానించాయి. లాభనష్టాలు బేరీజు వేసుకున్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో కలసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎలాంటి పదవి లేని నేతలను, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని నాయకులకు కాషాయ కండువాలు కప్పేందుకు ఆసక్తి చూపిన హోం మంత్రి అమిత్ షా.. ఈటలకు మాత్రం కండువా కప్పేందుకు రాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా.. ఈటలను ఆహ్వానించలేదు. తూతూ మంత్రంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కండువా కప్పించి పంపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఈటల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో.. హుజురాబాద్‌లో ఆయన ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
Also: ఆపరేషన్ హుజూరాబాద్ ప్రారంభించిన కేసీఆర్