ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఎంత ఫాస్ట్ గా ఎదిగారో అంతే స్పీడ్ తో డౌన్ ఫాల్ అయిన ప్రముఖుల్లో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఒకరు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ ఎస్పీ రిజర్వడ్ స్థానం నుంచి టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రావెల కిశోర్ బాబు.. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే చంద్రబాబు మంత్రివర్గంలో సోషల్ వెల్ఫేర్ మంత్రిగా పనిచేశారు. అయితే రావెల పొలిటికల్ గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో అదే స్థాయిలో డౌన్ ఫాల్ అయింది.
2019లో జనసేన తరఫున ప్రత్తిపాడు నుంచి ఓటమి చెందిన తర్వాత బీజేపీలో చేరారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. అయితే ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. ఈ తర్వాత ఈ బీజేపీ నేత, మాజీమంత్రి ప్రస్తుత రాజకీయాల్లో అంత చురుకుగా లేరనే చెప్పాలి. ఏపీ బీజేపీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువే. అయితే రావెల మౌనరాగం వెనుక ఉన్న అంతర్యమేంటో కమలదళానికి అర్ధం కావడంలేదు. ఆయన బీజేపీలో కొనసాగి తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచే పోటీ చేస్తారా.. లేదా మళ్లీ పొలిటికల్ రూట్ మారుస్తారా.. ? అనే సందేహాలు లేవనెత్తుతున్నారు.
ఉన్నత కొలువుల నుంచి..
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామానికి చెందిన రావెల కిశోర్ బాబు కేంద్ర సర్వీసుల్లో అనేక ఉన్నత పదవులు నిర్వర్తించారు. ఉన్నత విద్యావంతుడైన రావెల..తొలుత ఎకనామిక్స్ లెక్చరర్ గా తర్వాత ఎస్బీఐ ప్రొబెషనరీ ఆఫీసర్ పనిచేశారు. 1987లో సివిల్స్ రాసి IRTS కు ఎంపికయ్యారు. రైల్వే శాఖలో అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. 2000 నుంచి 2002 వరకు లోక్ సభ స్పీకర్ బాలయోగి దగ్గర ప్రైవేట్ సెక్రేటరీగా పనిచేశారు.
పొలిటికల్ ఎంట్రీ….
చదువు పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు డిగ్రీ విద్యార్థులకు అర్ధశాస్త్ర పాఠాలు బోధించిన రావెల.. 53 ఏళ్ల వయసులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ లో చేరి ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచిరితపై విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. పొలిటికల్ గా నాలుగేళ్ల పాటు టీడీపీ తెరపై ఓ వెలుగు వెలిగారు. తర్వాత ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో కాని, టీడీపీలో దళితులకు గౌరవం దక్కడం లేదని విమర్శలు చేశారు. అనంతరం మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. తర్వాత బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. కానీ .. 2019 ఎన్నికల సమయంలో జనసేనలో చేరి తన సిట్టింగ్ నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచే ఎన్నికల బరిలో నిలిచి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఘాటు విమర్శలు..
జనసేనలో చేరిక సమయంలో ఓకింత ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టగా రావెలను పవన్ ఓదార్చారు. టీడీపీ సర్కార్ దళితులకు పదవులు ఇచ్చినప్పటికీ పనిచేసే అధికారం ఇవ్వట్లేదని చంద్రబాబు తీరుపై రావెల ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గంలో తన పర్యటనను కూడా అడ్డుకునేందుకు యత్నించడాన్ని చంద్రబాబుకు చెప్పుకున్నా పరిష్కారం లేదని మీడియా సాక్షిగా వాపోయారు. అయితే ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి తర్వాత బీజేపీలో చేరిన రావెల కిశోర్ బాబు.. జనసేన పార్టీ చీఫ్ పైనా విమర్శలు గుప్పించారు. జనసేనకు రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరిన రావెల.. పార్టీని నడపడంలో పవన్ ఫెయిల్ అయ్యారని.. రాజకీయ పరమైన వ్యూహాలు చర్చించేందుకు జనసేన చీఫ్ తనకు సమయం ఇవ్వలేదని ఆరోపించడం అప్పట్లో వైరల్ అయింది. .
గెలిచిన చోటే ఓటమి…
ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావెల కిశోర్ బాబు 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ఎమ్మార్పీఎస్ ఫౌండర్ మంద కృష్ణ మాదిగ కూడా నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేశారు. అయినప్పటికీ విజయం సాధించలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ రెండో స్థానంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గానికి చెందిన వారే. రావెల కిశోర్ బాబుది రావెల గ్రామం కాగా మేకతోటి సుచరిత స్వస్థలం ఫిరంగిపురం.
ఇక టీడీపీ తరఫున పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో 96 వేల పై చిలుకు ఓట్లు సాధించి గెలిచిన రావెల.. 2019లో ఎన్నికల్లో మాత్రం మూడో స్థానానికి పరిమితమవ్వగా వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై 7వేల ఓట్ల మెజారిటితో గెలిచారు.
బీజేపీలో చేరిన కొత్తలో న్యూస్ ఛానళ్ల నిర్వహించే డిబేట్లలో కొన్ని రోజులు పాల్గొన్న రావెల కిశోర్ బాబు.. తనపై వచ్చిన సీఆర్డీఏలో అసైన్డ్ భూములు కొనుగోలు ఆరోపణలపై స్పందించారు. తాను అక్రమంగా ఏ భూమి కొనలేదని ప్రెస్ మీట్ లో వివివరించే ప్రయత్నం చేశారు. అప్పట్లో అమరావతి ఉద్యమ శిబిరానికి వెళ్లి వారికి మద్దతు కూడా తెలిపారు. తర్వాత మాత్రం ప్రత్తిపాడులో పర్యటించిన దాఖలాలు లేవు. అలాగే రాష్ట్రంలో బీజేపీ నిర్వహించే ఆందోళనలో పాల్గొన్న సందర్భాలు కూడా తక్కువే. రాజకీయంగా సేఫ్ సైడ్ ఉండేందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారనే విమర్శలు కూడా రావెల పై ఉన్నాయి. అయితే ఆయన ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? ఎంపీగా పోటీ చేస్తారా.. ? పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి.