Idream media
Idream media
కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రాష్ట్రంలోని ఎన్నికల సంగ్రామం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా టీఎంసీ, బీజేపీ మధ్య రేగిన రాజకీయ అగ్గి ఇప్పటికీ వేడిగానే ఉంది. హోరాహోరీ పోరులో టీఎంసీదే పై చేయి అయింది. ఎంతో కష్టపడి పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 77 సీట్లను సాధించుకోగలిగింది. రోజులు కూడా గడవక ముందే ఎంతో కష్టపడి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు హఠాత్తుగా
రాజీనామా చేశారు. కారణం ఏంటంటే…
మొత్తం 292 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్ లో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాగా అభ్యర్థుల మరణం కారణంగా రెండు స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. 2016 ఎన్నికలలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల ఉన్న భారతీయ జనతా పార్టీ బలం 77 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. అయితే తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 75కి పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు లోక్ సభ సభ్యులు కావడంతో ఏదో ఒక పదవిని వదులుకోవాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్న బీజేపీ అధిష్ఠానం సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు బుధవారం అందించారు.
ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 రోజుల్లోనే పదవులకు రాజీనామా చేయడంతో అధికార తృణమూల్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో వీరు బీజేపీ ఎంపీలుగా కొనసాగనున్నారు. రణఘాట్ నియోజవర్గానికి సర్కార్ ఎంపీ గా ఉండగా కూచ్ బెహర్ నియోజకవర్గం నుంచి ప్రమాణిక్ ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలో పార్టీ ఆదేశాల మేరకు దిన్ హటా శాంతిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. తాజాగా పార్టీ ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు సర్కార్ ప్రమాణిక్ తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ఆశతో ఎంపీలకు బీజేపీ అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది. కానీ మమతా బెనర్జీ ఎత్తుల ముందు బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. దీంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరి ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే ఉపయోగం ఉంటుందని కాషాయ పార్టీ భావించింది.
బెంగాల్ లో ఈ ఫలితం ఊహించలేదు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కీలక పాత్ర పోషించేవాళ్లం ప్రస్తుతం అది సాధ్యకాదు కాబట్టి ఎంపీలుగా ఉండాలని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది.. అందుకే రాజీనామా చేశాం అని రణఘాట్ ఎంపీ జగన్నాథ్ సర్కారు వెల్లడించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో సర్కార్ శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. సర్కార్ తన సమీప ప్రత్యర్థిపై 15878 ఓట్ల తేడాతో శాంతిపూర్ సీటును గెలుచుకోగా దిన్హటా నియోజకవర్గంలో ప్రమానిక్ టీఎంసీ అభ్యర్థిపై 57 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో లాకెట్ ఛటర్జీ రాజ్యసభ మాజీ సభ్యుడు స్వాపన్ దాస్ గుప్తా మరో ఇద్దరు లోక్ సభ ఎంపీలను కూడా బీజేపీ అసెంబ్లీ బరిలో నిలబెట్టింది. కానీ వారంతా ఎన్నికల్లో ఓడిపోయారు.