iDreamPost
iDreamPost
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార వైఎస్సార్‌సీపీని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో ఏ పార్టీ లేదన్నది నిర్వివాదాంశం. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వృద్ధ నిర్ణయాలతో సతమతమవుతోంది. బీజేపీ తన మూలాలను జనంలోకి జొప్పించే ప్రయత్నాల్లోనే ఇంకా ఉంది. సంస్థాగత నిర్మాణం చేయలేక జనసేన మల్లగుల్లాలు పడుతోంది. కామ్రేడ్‌లు తడవకోసారి ఏదో ఒక పార్టీకి ఆసరాగానే మిగిలిపోతున్నారు. ఎంతో కొంత ప్రతిపక్షం అనదగ్గ పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు మాత్రమేననిప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. ఇందులో కూడా ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదాని ఇవ్వగా, కేంద్రంలో ఉన్న అధికారం కారణంగా బీజేపీ తనకుతానే ఆ హోదాలో ప్రవర్తించేస్తుంది. ఇక సిని గ్లామర్‌తో పవన్‌కళ్యాణ్ నెట్టుకొచ్చేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళంతా కూర్చుని ఏక బిగిన చప్పట్లు చరిచినా కూడా అధికార వైఎస్సార్‌సీపీపై జనంలో ఉన్న అటెన్షన్‌ను వీసమెత్తుకూడా మరల్చగలిగే పరిస్థితి లేదన్నది విశ్లేషకులు తేల్చిచెబుతున్న సంగతి.
ఇందుకు రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా నిలుస్తాయి. అంతే కాకుండా భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన కొంత కాలానికి సదరు ప్రభుత్వాలపై ఎంతో కొంత వ్యతిరేక భావన పెరగడం సహజం. ఇది గతంలో నడచిన హేమాహేమీ ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పెద్దగా ఈ తరహా ఫిర్యాదులు లేదన్న అంచనాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షాన్ని వేలెత్తిచూపించేందుకు తగిన దారి ప్రతిపక్షాలకు దొరకడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే మతం దారిని ఎంచుకున్నట్లుగా ఖరారు చేస్తున్నారు. సీయంకే కాకుండా.. హోం మంత్రికి.. డీజీపీకి కూడా మతం రంగును పులిమేందుకు దేశంలోనే సీనియర్ పొలిటీషిన్ సిద్ధపడిపోవడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.
జనం దగ్గరకు వెళ్ళేందుకు తగినంత పస తగ్గిపోవడంతో దాదాపు ఆత్మహత్యతో సమానమైన ‘మత తత్వ’ దారిని ఎంచుకోవడం సర్వత్రా ఆశ్చర్య పరిచినప్పటకీ.. ఇప్పటికిప్పుడు మనుగడను కాపాడుకోవడానికి వారికి ఇంతకంటే ఉత్తమ దారి కన్పించకపోవడం కూడా ఒక కారణంగా వివరిస్తున్నారు. కానీ వీళ్ళ ఉనికికోసం లేవనెత్తిన మతం అనే అంశాన్ని ఏపీ ప్రజలు చాలా విజ్ఞతతోనే రిసీవ్ చేసుకుంటారన్న చరిత్రను వీళ్ళెందుకు మర్చిపోయారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.
గతంలో ఎప్పుడూ కూడా మత సంబంధమైన వివాదాలు గానీ, దానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల విషయంలో గానీ ఏపీ ఓటర్లు ధర్మం పక్షాన్నే నిలిచి హుందాగానే వ్యవహరించినట్లు చరిత్రచెబుతోన్న వాస్తవం. అయినప్పటికీ ఘతన వహించిన ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రజల మెదళ్ళలోకి కూడా మతాన్ని జొప్పించే ప్రయత్నానికి తగిన ఫలితం వారికి అప్పగించేయడం ద్వారా మాత్రమే ఏపీ ప్రజల విజ్ఞతను మరోసారి ప్రకటించుకోగలుగుతారు. ఇందుకు తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికతో పాటు, వచ్చేనెలో.. ఆవచ్చేనెలో.. ఆపై వచ్చేనెల్లోనూ.. ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మతాన్ని భుజానికెత్తుకున్న వారికి తగిన శాస్తిచేసేందుకు ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పిస్తాయనడంలో ఎటువంటి సందేహం పడనక్కర్లేదు.