iDreamPost
iDreamPost
దేశ యువతలో ఎన్నో ఆశలు రేపి అధికారం చేజిక్కించుకున్న మోదీ పాలనలో ఎనిమిదో బడ్జెట్ ప్రజల ముందుకొచ్చింది. మరో రెండు బడ్జెట్లు ప్రతిపాదించే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంటుంది. దాంతో పదేళ్ల పాలనలో ఆర్థిక రంగంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఏమేరకు మేలు చేశాయనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ మీద అసంతృప్తి రాజుకుంటోంది. అన్ని వర్గాల్లోనూ నిరాశ కనిపిస్తోంది. దేశ ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టాల్సిన దశలో దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ బడ్జెట్ మీద అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. నేషనల్ బిల్డింగ్ మిషన్ లో రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 19.74 లక్షల కోట్ల నుంచి 2021-22లో 23.21 లక్షల కోట్లకు పెరుగుదల ప్రోత్సాహకరంగా ఉందని బుగ్గన విశ్లేషించారు. ద్రవ్యలోటు కూడా 21 శాతం నుంచి మెరుగుపడిందని, రెవెన్యూలో 7.34 శాతం నుంచి 4.69 శాతానికి తగ్గడం ఆశాజనకంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వానకి స్థూల పన్ను రాబడిలో జీఎస్టీ ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు. దానిమూలంగానే స్థూల పన్ను ఆదాయం 2020-21లో 14.26 లక్షల కోట్లుగా ఉంటే 2021-22లో 17.65 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అప్పులు భారీగా పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వడ్డీ చెల్లింపులు 8.14 లక్షల కోట్ల నుండి 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం 9.41 లక్షల కోట్లకు పెరగడం కలవరపరుస్తోందన్నారు. రక్షణ రంగానికి కేటాయింపుల్లో 13.89 లక్షల కోట్ల నుంచి 15.23 లక్షల కోట్లకు అంచనాలు పెంచారన్నారు. రైల్వే రంగానికి కూడా 2021-22లో లక్ష కోట్లు కేటాయిస్తే 2022-23లో 2.39 లక్షల కోట్లు అంచనా వేయడం శుభపరిణామం అంటూ వివరించారు.
రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే వాటిని ఏడు ఇంజన్లుగా పేర్కొంటూ పీఎం గతి శక్తి పథకం ప్రయోజనకరమని అన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పథకానికి రూ. 1.0 లక్షల కోట్లను మెరుగుపరచడం కూడా మంచి చొరవతో కూడుకున్న అంశంగా అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీతో పాటుగా ఎరువులు, ఆహార సబ్సిడీ పథకాలకు కేటాయింపుల్లో తగ్గుదల నిరాశ పరుస్తోందన్నారు. కోవిడ్ తదనంతర పరిస్థితుల దృష్ట్యా నేషనల్ హెల్త్ మిషన్ కి కేటాయింపులు పెంచాల్సిన అవసరముందని బుగ్గన కోరారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్లతో పాటుగా రాష్ట్రాలకు బదిలీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో కూడా తగ్గించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేటాయింపులు 2020-21లో 8.59 లక్షల కోట్లుగా ఉంటే 2022-23 నాటికి 7.95 లక్షల కోట్లకు పడిపోయాయని వాపోయారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో పూర్తి నిరాశ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం విస్మరించడం బాధాకరం అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, కేంద్ర సంస్థలతో పాటుగా ఇతర వాగ్దానాలను కూడా ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిరాశ వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్దికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ బడ్జెట్ పై ఏపీని మించి తెలంగాణా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తెలంగాణా ప్రభుత్వం తరుపున నేరుగా సీఎం సీన్లోకి వచ్చి మోదీ సహా కేంద్రాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇతర పలు రాష్ట్రాలు కూడా ఇదే రీతిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని తీవ్ర నిరాశపరిచిన బడ్జెట్ గా అభివర్ణించారు.
Also Read : బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. ఆ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి రెడ్డి