iDreamPost
iDreamPost
ఇటీవలే ప్రసిద్ధ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ని అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజనా రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ తో పాటు ఎంవివి సత్యనారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. అయితే ఎవరు ఆ పాత్రను చేస్తారనే విషయం మాత్రం మేకర్స్ బయట పెట్టలేదు. నిజానికి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదట. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని వినిపిస్తోంది. వాటి ప్రకారం తాప్సి పన్ను ఒక ఆప్షన్ గా ఉండగా మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇవన్ని ప్రాధమిక దశలోనే ఉన్నాయి కాబట్టి ఎవరిని ఖరారు చేయబోయేది అందుకే చెప్పలేదని తెలిసింది.
2000వ సంవత్సరంలో ఇండియాకు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన లేడీగా మల్లీశ్వరి పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఎందరికో ఆవిడ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. మల్లీశ్వరి రూపం కాస్త బొద్దుగా ఉంటుంది. దేహ ధారుడ్యంతో కొండలైనా పిండి చేసే ధృడ సంకల్పంతో కనిపించేవారు. అభిమానులు మనసులోనూ అలా ప్రతిష్టించుకుని ఉన్నారు. మరి గ్లామర్ తరహా పాత్రలే ఎక్కువగా చేసిన హీరొయిన్లకు ఈ రోల్ అంతగా నప్పకపోవచ్చు. తాప్సి ఇప్పటికే బాలీవుడ్ లో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. అందులో సుర్మా లాంటి స్పోర్ట్ బేస్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అవేవి ఫిజికల్ గా మార్పులను డిమాండ్ చేసినవి కావు.
మరి మల్లీశ్వరిగా కనిపించాలంటే కొంచెం ఒళ్ళు పెంచక తప్పదు. మరి ఈ భామ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఒప్పుకుంటుందా లేదా చూడాలి. మరోవైపు రకుల్ కూడా మంచి ఛాయసే కాని ఇప్పటిదాకా తను ఇంత కఠినమైన సవాల్ ని తీసుకోలేదు. ఒకవేళ చేస్తే మాత్రం చాలా కసరత్తులు అవసరం అవుతాయి. మరి దర్శక నిర్మాతల ఆలోచనలో ఎవరున్నారో వేచి చూడాలి. జెర్సి తర్వాత టాలీవుడ్ లో ఏ బయోపిక్కులు రాలేదు. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన అశ్విని తర్వాత తెలుగులో మహిళా క్రీడాకారుల కథలు తెరపై రాలేదు. ఇప్పుడు మల్లీశ్వరి రాబోతోంది. తర్వాత క్రికెటర్ మిధాలి రాజ్ కథను కూడా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇదంతా ఒకరకంగా మంచి పరిణామమే.