Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీదే గెలుపు అనే ప్రచారం మొదటి నుంచీ జరుగుతూనే ఉంది. అందుకు కారణం లేకపోలేదు.. ఉప ఎన్నికకు ముందు జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ దెబ్బకు పరిషత్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చేతులెత్తేయాల్సిన పరిస్థితి. కానీ, ముందే డిసైడ్ కావడంతో తిరుపతి బై పోల్ లో మాత్రం ఆ పార్టీ ఎట్టోగట్టా ప్రచారం ముగించింది. జనసేనతో జట్టు కట్టిన బీజేపీ కూడా మాజీ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపి రాజకీయంగా భవిష్యత్ బలపడాలంటే.. ఇక్కడ ఎలాగైనా సత్తా చాటాలని అన్ని రకాల జిమ్మిక్కులూ చేసింది. ఈ ఉప ఎన్నికకు నేడే పోలింగ్ జరగనుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత రెండు పర్యాయాలూ వైసీపీకి అడ్డాగా మారింది. వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీనే గెలుపొందింది. మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నట్లుగా మూడో సారీ వైసీపీదే గెలుపు అయితే, ఆ తర్వాత స్థానాల్లో నిలిచి ఎవరు పరపతి నిలబెట్టుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.
రెండో స్థానం కోసమే పోటీనా..?
2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నికలో భాగంగా నేడు పోలింగ్ జరగనుంది. అధికారులు మొత్తం 1056 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాల్లోనూ సుమారు 7 లక్షలా 40 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పుడు వారిలో మెజార్టీ ఓటర్లు ఎటు మొగ్గుచూపుతారనేది ఉత్కంఠ ఏర్పడింది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ తదితరులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది. ఈసారి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. పోయిన సారి తగ్గిన తిరుపతిలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలవడం పక్కాగా కనిపిస్తోంది. సుమారు 4 నుంచి 5 లక్షల మెజార్టీ లక్ష్యంగా వైసీపీ టీమ్ పని చేసింది. ఇప్పుడు ఆ మెజార్టీని ప్రతిపక్షాలు తగ్గించగలవా అనే సందేహాలు ఒక పక్క అయితే, రెండో స్థానంలో నిలిచేదెవరు అనేది మరో ఉత్కంఠ.
ఆ పార్టీల కంటే నోటాకే జై…
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ సీటులో 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మీపై 228576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక్క తిరుపతిలో మాత్రమే టీడీపీకి ఆధిక్యం లభించగా మిగతా ఆరు చోట్ల వైసీపీకే మెజార్టీ వచ్చింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే గెలవడం విశేషం. తిరుపతిలోనూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. ఇక బీజేపీ తరుఫున 2019 లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి బొమ్మి శ్రీహరిరావు పోటీచేశారు. ఆయనకు మొత్తం 16125 ఓట్లు మాత్రమే లభించాయి. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావుకు 20971 ఓట్లు రావడం విశేషం. ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసిపోవడంతో సరాసరి 35 వేల ఓట్లు వీరివి ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ జనసేనల కంటే కాంగ్రెస్ పార్టీ నోటా ఎక్కువ ఓట్లు సాధించడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 24039 ఓట్లు నోటాకు ఏకంగా వీరిందరికంటే ఎక్కువగా 25781 ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు కూడా నోటా ఆసక్తిగా మారింది.