Idream media
Idream media
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ ఉండడంతో మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,09,228, మహిళలు 1,11,072మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే 1,844 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 1,542 మంది నూతన ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన వారు 2,696 మంది ఉన్నారు. 8151 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పొడిగించారు. నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉండగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక లో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవినాయక్ మొట్ట మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు. వారి రాజకీయ భవిష్యత్తు ఈ ఫలితంపైనే ఆధారపడి ఉంది. సిట్టింగ్ స్థానాన్ని దిక్కించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా ప్రధాన ప్రతిపక్షాలు అందుకు దీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే రాష్ట్రంలో తమ అధికారానికి ఢోకా ఉండదని టీఆర్‌ఎస్, వరుస ఓటముల నుంచి బయటపడి రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే గెలుపు అనివార్యమని కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ తరువాత సాగర్‌ను గెలిచి టీఆర్‌ఎస్‌కు ఈ రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ తహతహలాడి.
జానా అనుభవాన్ని గుర్తిస్తారా..?
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరిలో కుందూరు జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మూడు సార్లు మంత్రిగా కూడా చేశారు. ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించడంతో ప్రతి ఒక్కరితోనూ ఇక్కడ జానాకు అనుబంధం ఉంది. ఏడు సార్లు అధికారంలో ఉండడంతో అభివృద్ధి పనుల్లో కూడా తన ముద్ర కనిపిస్తుంది. స్థానికంగా గట్టి పట్టు ఉండటం, నియోజకవర్గంలోని అన్ని స్థాయి ప్రజలతోను, సంఘాలతోను ఆయనకు గల పరిచయాలు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి తోడు 2019 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్సే కైవసం చేసుకుంది. ఇవన్నీ సానుకూల అంశాలు కాగా, గతంలో కాంగ్రెస్ వైభవం ఎలాగున్నా ప్రస్తుతం ఆ పార్టీ వరుస ఎన్నికల్లో ఓటమి చవి చూస్తోంది. ఇక్కడ కూడా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెడ్డి సామాజిక వర్గంతో పాటు మరికొన్ని సామాజిక వర్గాల ప్రధాన నాయకులు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీనికి తోడు అధికార పార్టీ కూడా గట్టిగా ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో పోరు ఆసక్తిగా మారింది.
అధికార పార్టీ అండ ఉంది కానీ..
టీఆర్ఎస్ నుంచి నోముల భగత్ పోటీలో ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్ దుబ్బాక ఉప ఎన్నిక మినహా ప్రతి ఉప ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వస్తోంది. దీనికి తోడు ఇక్కడ 37 వేల యాదవ సామాజిక వర్గం ఓట్లు భగత్ కు కలిసి వస్తాయని విశ్లేషకుల అంచనా. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా పాల్గొని రూ.3వేల కోట్ల విలువైన 13ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం, రెండు సార్లు సీఎం సభ జరగడంతో టీఆర్ఎస్ బాగా హైలెట్ అయింది. సగం రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, కుల సంఘాల నేతలు గెలుపునకు పనిచేయడం, సీఎం స్వయంగా ఎన్నికల పనిని రోజు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేసేవారు. వీటితో పాటు నోముల నర్సింహయ్య మృతితో సానుభూతి పవనాలు వీస్తాయని భగత్ వర్గం ఆశిస్తోంది. అయితే, రాజకీయ అనుభం లేకపోవడం, స్థానికేతరుడు అన్న ప్రచారం భగత్ కు అవరోధంగా మారే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ జోరు కొనసాగేనా..?
సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్‌నాయక్ ను పార్టీ రంగంలోకి దింపింది. అతనికి అండగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 40 వేల ఓట్లు కలిగిన లంబాడ సామాజిక వర్గానికి నాయకుడిగా, వైద్యుడిగా రవికుమార్ గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ తరువాత బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించడం, ప్రధాని నరేంద్రమోడీ సంక్షేమ పథకాలను బలంగా ప్రచారం చేసుకోవడం, యువతను పార్టీ వైపు ఆకర్షించడం కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. అయితే, ఆ పార్టీకి నియోజకవర్గంలో అంతగా పట్టు లేదు. రాజకీయంగా అనుభవం లేకపోవడం, నియోజకవర్గం తో పూర్తిగా పరిచయం లేకపోవడం, ఇటీవల కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పెరిగిన ధరలు బీజేపీకి అవరోధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా మూడు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ప్రజల నాడి ఎలా ఉందో చూడాలి.