మహా సంగ్రామంలో మాటల యుద్ధం నడుస్తోంది. అధికార ప్రతిక్షాల మధ్య వార్ పీక్స్ చేరింది. నగరం నడిబొడ్డున జరుగుతున్న ప్రచారం సరిహద్దులను తలపిస్తోంది. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటు పుట్టిస్తున్న పార్టీలు ప్రజా సమస్యల కంటే పొరుగు దేశాల ప్రస్తావనే పదే పదే తెస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపిన దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నగరం అక్రమ వలసదారులకు అడ్డాగా మారిందంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ ప్రచారాన్ని టర్న్ చేశాయి.
గ్రేటర్ ప్రచారంలో రోహింగ్యాల ప్రస్తావనే ప్రధానాంశంగా మారింది. బీజేపీ అగ్రనేతలు మొదలు, అధికార పార్టీ మంత్రులు, ఎంఐఎం ప్రతినిధులూ రోహింగ్యాల గురించే మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ రగడ ఇప్పట్లో ముగిసేలా కూడా లేదు. ఇంతకూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రోహింగ్యాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? నగరంలో నిజంగానే రోహింగ్యాలు ఉన్నారా? ఉంటే వాళ్లంతా అక్రమంగా దేశంలోకి చొరబడ్డవాళ్లేనా? ఈ సందేహాలే ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి.
పాతనగరంలో పాకిస్తాన్, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులున్నారని, వాళ్లని ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదానికి తెరతీశారు. గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే పాతనగరంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, పాకిస్తానీలు, రోహింగ్యాలను తరిమికొడతామని ప్రకటించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎంఐఎం, టీఆర్ ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలు సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఇతర దేశాల నుంచి అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఎదురు ప్రశ్నించారు.
గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సైతం రోహింగ్యాల అంశాన్ని ప్రస్తావించింది. హైదరాబాద్ లో రోహింగ్యాలుంటే హోం శాఖ ఎందుకు అడ్డుకోలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల కోసమే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సైతం హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తన నివేదికలో వెల్లడించిందన్నారు. సరైన సమయంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరంలో నాలుగువేల మందికి పైనే
అటు తిరిగీ ఇటు తిరిగీ గ్రేటర్ ప్రచారం మొత్తం రోహింగ్యాల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ నేతల వాదనకు బలమిచ్చే రీతిలో పోలీస్ శాఖ సైతం నగరంలో రోహింగ్యాలున్నారని తేల్చిచెప్పింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకూ రోహింగ్యాలపై 65 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. నగరంలో మొత్తం 4835 మంది రోహింగ్యాలను గుర్తించామని, వీరిలో ఇప్పటికే 4561 మందికి బయోమెట్రిక్, ఐరీష్ లు పూర్తి చేశామన్నారు. బోగస్ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లెస్సెన్స్ లు కలిగి ఉన్న పలువురి పై కేసులు నమోదు చేశామని తెలిపారు. సీపీ ప్రకటనతో హైదరాబాద్ లోకి రోహింగ్యాలు అక్రమంగా చొరబడుతున్నారా అనే సందేహం అందరిలో మొదలైంది.
ఎవరీ రోహింగ్యాలు ?
బౌద్ధ మతస్తులు మెజారిటీగా గల మయన్మార్‌లో పదిలక్షల మందికి పైగా బెంగాలీ మాండలికం మాట్లాడే రోహింగ్యాలు రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. కానీ స్థానిక ప్రభుత్వం వారిని తమ దేశ పౌరులుగా గుర్తించనిరాకరిస్తోంది. వారంతా బంగ్లాదేశ్ నుంచి తమ దేశానికి అక్రమంగా వలస వచ్చారని వాదిస్తోంది. రోహింగ్యాల్లో మెజారిటీ ప్రజలు ముస్లింలే అయినా వారిలో హిందువులు కూడా మైనారిటీ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోనే తీవ్ర అణచివేతకు గురవుతున్న జాతుల్లో రోహింగ్యాలు కూడా ఉన్నారు. 1942, 1978, 1991ల్లో ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యల్లో లక్షలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారు. 2012 అక్టోబర్‌లో మరోమారు ప్రభుత్వం మిలిటరీ చర్యలకు దిగింది. దీంతో… దిక్కు తోచని స్థితిలో పొట్టచేతపట్టుకొని లక్షలాది మంది రోహింగ్యాలు వలసబాట పట్టారు. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ … ఇలా దేశ దేశాలకు సముద్ర, భూ మార్గాల ద్వారా వెళ్లారు. అలా బంగ్లాదేశ్ మీదుగా కొందరు ఈశ్యాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు.
ప్రాణాలు గుప్పిట పెట్టుకొని సరిహద్దులు దాటిన వారికి ఐక్య రాజ్యసమితి అండగా నిలిచింది. అలా కొందరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. వారి కోసం పాతనగరంలో ప్రత్యేకంగా ఐక్యరాజ్యసమితి క్యాంపును ఏర్పాటు చేసింది. వారికి శరణార్థి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చింది. బాలాపుర్ పరిసరాల్లో వీళ్లు ఎక్కువగా కనిపిస్తారు. రోజు కూలీ చేసుకొని జీవనం సాగిస్తుంటారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు… దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో ఇలాంటి క్యాంపులున్నాయి. నిజానికి వీళ్లంతా ప్రాణాలు అరచేతపట్టుకొని వలస వచ్చిన వాళ్లే.
ఎందుకీ రాద్దాంతం?
సొంత నేల మీదే పరాయి వాళ్లు గా మారడంతో రోహింగ్యాలు హక్కుల పోరాటాన్ని ప్రారంభించారు. 2016లో అరాకన్ రోహింగ్యా విముక్తి సేన పేరుతో ఒక మిలిటెంట్ గ్రూప్ ఏర్పడింది. దీనిని తీవ్రవాద సంస్థగా గుర్తించిన స్థానిక ప్రభుత్వం రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దీంతో లక్షలాది మంది వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నారు. రోహింగ్యాలకు ఉన్న ఈ నేపథ్యమే గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ రగడకు కారణమైంది. కానీ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు రోహింగ్యాలను వాడుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మెజార్టీ రోహింగ్యాలు ముస్లిం తెగకు చెందినవారు కావడం వల్లే బీజేపీ వీరిని బూచిగా చూపించి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అటు టీఆర్ఎస్, ఎంఐఎంలు ఈ విషయంలో బీజేపీనే దోషిని చేయాలనుకుంటున్నాయి. మొత్తానికి బీజేపీ మొదలుపెట్టిన ఈ రాద్దాంతం ఏ కొలిక్కిచేరుతుందో.