Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీకాగా, మేయర్ పీఠం అధిరో హించే మహిళా నేత ఎవరనే ఆసక్తి నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. ఏ పార్టీకి సంపూర్ణ మెజా రిటీ రాకున్నా టీఆర్‌ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలు సాధించగా, కోరంతో సంబంధం లేదని.. ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటే వారినే విజేతగా నిర్ణయిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ, ఎంఐఎం కలిసే అవకాశం లేదు కాబట్టి.. ఏ లెక్కన చూసినా.. టీఆర్‌ఎస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 56మంది కార్పోరేటర్‌లు, 32మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. మేయర్ పదవికోసం సీనియర్ కార్పోరేటర్లతో పాటు కొత్తగా కార్పోరేటర్‌గా ఎన్నికైన మహిళా నేతలు పోటీ పడుతున్నారు. విపక్షాలు బలంగా ఉండడంతో.. కౌన్సిల్‌ను చాకచక్యంగా నిర్వహిం చగలిగే రాజకీయ నేర్పు ఉన్న మహిళా నేతను అభ్యర్ధిగా ఖరారు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో 50శాతం మహిళా కార్పోరేటర్లే ఉం డగా, ఆశావహులు.. తమకు నేతలతో ఉన్న అనుబంధం, పార్టీకి అందించిన సేవలు, కుటుంబ నేపథ్యం వివరిస్తూ అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
భారతీనగర్ డివిజన్ నుండి గెలుపొందిన సింధూ ఆదర్శ్‌రెడ్డి పేరు మొదట బలంగా వినిపించింది. మెదక్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కోడలు కావడం, సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీకి ఆదినుండి మంచి సంబంధాలు ఉండడం విధేయత కోణంలో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఉన్నత విద్యార్హత, సేవచేయాలనే తపన కూడా అదనపు అర్హతలుగా అథిష్టానం గుర్తించింది.
మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయ శాంతి రెడ్డి పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. గత అసెంబ్లి ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్‌కు మొదట విజయశాంతి పేరు ఖరారుచేసినా, ఈ సీటు కోసం మైనంపల్లి హన్మంతరావు పట్టుబట్ట డంతో విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం అటు వైపు మొగ్గు చూపింది. ఇపుడు విజయశాంతి అభ్యర్థిత్వం పట్ల హనుమంతరావు కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. చివరి లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెంది మన్నె గోవర్దన్ రెడ్డి భార్య మన్నె కవితారెడ్డి పేరు కూడా బలంగా రేసులో వినబడుతోంది. గత అసెంబ్లి ఎన్ని కల్లో మన్నె గోవర్దన్ రెడ్డి స్ధానంలో టికెట్‌ను దానం నాగేందర్‌కు కేటాయించారు. సికింద్రాబాద్ నియో జకవర్గానికి చెందిన మోతె శోభన్ రెడ్డి భార్య శ్రీలత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు కూడా బలంగా వినబడు తోంది. గత మేయర్ ఎన్నిక సందర్భంగానూ బలంగా వినిపించినా అనూహ్యంగా అవకాశం చేజారింది. ఈసారైనా కలిసొస్తుందన్న అంచనాలో ఉంది.
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ఈ పీఠంపై ఆశలు పెట్టుకుంది. తండ్రి వారసత్వం, పేరు కలిసి వస్తుందన్న అంచనాలో ఉంది.
మంత్రి కేటీఆర్‌కు విధేయుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ టర్మ్ ముగియగా, ఆమె సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ అదే డివిజన్ నుండి విజయం సాధించింది. శ్రీదేవి పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. జీ హచ్‌ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడు దలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆర్. పార్థసారథి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నిక లను పరోక్ష పద్ధతిలో ఫిబ్రవరి 11న ఉదయం 12.30 గంట లకు నిర్వహించనున్నారు. తొలుత నూతనంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంట లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. అదే రోజు కుదరని పక్షంలో మరుసటి రోజు 12న, ఒకవేళ సెలవు దినమైనప్పటికీ ఎన్నికను నిర్వహించనున్నారు.
కేకే ఈసారి ఇక్కడే..?
జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యు ల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. 2016లో ఈ సంఖ్య 49వరకు ఉండగా, ఈసారి 42 నుంచి 43 మంది వరకు ఉండే అవకాశముందని ఓ అధికారి చెప్పారు. ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీల్లో ఎంత మందికి గ్రేటర్‌లో ఓటు హక్కు ఉంది అన్న విషయాన్ని పరిశీలించిన అనంతరం ఈ సంఖ్య మారవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ సీడీఎంఏకు శనివారం లేఖ రాసింది. ఎమ్మెల్సీల వివరాలివ్వాలని శాసనసభా కార్యదర్శిని కూడా కోరినట్టు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం గ్రేటర్‌లో ఓటరు అయిన ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియోగా ఉండే అవకాశముంది. ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీని ఆప్ట్ చేసుకోవడం, పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మండలి నుంచి తీసుకునే ఎమ్మెల్సీల వివరాల ఆధారంగా వారికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు ఉందా, లేదా అన్నది ఎన్నికల విభాగం అధికారులు పరిశీలిస్తారు. నోటీసులు పంపే తేదీ నాటికి ఓటరు జాబితాలో ఎమ్మెల్సీ/ఎంపీ పేరుంటే 11వ తేదీన ప్రత్యేక సమావేశం ఉందన్న సమాచారంతో నోటీసులు పంపుతారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోని వారికి మాత్రమే జీహెచ్‌ఎంసీలో ఓటు వేసే అవకాశముంటుంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ఆదిభట్ల మునిసిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేశారు. కిందటి పదవీ కాలంలో ఆయన ఓటు వేయడం, ఇటీవల మళ్లీ ఎంపికైన నేపథ్యంలో ఈ సారి జీహెచ్‌ఎంసీలో కూడా ఎక్స్‌అఫీషియో ఓటు వేసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కార్పొరేటర్లు పార్టీ విప్ పాటించాల్సి ఉండగా, ఎక్స్‌అఫీషియోలకు విప్ వర్తించదు.