iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీఎం జగన్ తో సీఎస్, డీజీపీ కి మధ్య సమన్వయం కనిపిస్తోంది. అనేక సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకునే దిశలో టీమ్ వర్క్ సాగుతున్నట్టు అంతా భావిస్తున్నారు. అనేక సమయాల్లో సీఎస్ గురించి టీడీపీ అనుకూల పత్రికల్లో పలు కథనాలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం ప్రభుత్వ విధానాల విషయంలో జగన్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి తీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు, చివరకు సెలవుపై వెళుతున్నట్టు కూడా ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో పదే పదే కథనాలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం యధావిధిగా తన విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే వచ్చే నెలాఖరుతో ఆమె పదవీకాలం పూర్తికాబోతోంది. జూన్ 2న ఆమె రిటైర్ కావాల్సి ఉంది. దాంతో అనివార్యంగా కొత్త సీఎస్ ఎంపిక విషయం ముందుకు రాబోతోంది.
దాదాపుగా ఏడాది కాలం పూర్తికావస్తున్న జగన్ పాలనలో ఇప్పుడు నీలమ్ సహాని రెండో సీఎస్. తొలుత ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బాధ్యతల్లోకి వచ్చినప్పటికీ జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయన్ని కొనసాగించారు. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో కొత్త సీఎస్ ని తీసుకొచ్చేందుకు సాగించిన వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ఎట్టకేలకు తాత్కాలిక సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ని కొద్దికాలం కొనసాగించిన అనంతరం నీలమ్ సాహ్నే బాధ్యతల్లోకి వచ్చారు. రాజధాని మార్పు, మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ తో వివాదం, తాజాగా కరోనా విపత్తు వంటి అనేక సమస్యలు ఎదురయినా ఆమె జగన్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించారు. దాంతో సీఎం, సీఎస్ మధ్య మంచి సమన్వయం ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆమె పదవీకాలం ముగియబోతున్న సమయంలో మరోసారి కొత్త సీఎస్ ఎవరు అనే చర్చ మొదలయ్యింది. అదే సమయంలో ఆమెను కొనసాగించేందుకు తగ్గట్టుగా పదవీకాలం పొడిగించే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన కూడా ఉంది. దాంతో జగన్ ఆమెకు మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అన్నది కూడా చర్చనీయాంశమే.
ఈసారి జగన్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారో అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో మొదలయ్యింది. సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, ఆదిత్యానాధ్ దాస్ వంటి కొందరు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ జగన్ మనసులో ఎవరున్నారన్నది మాత్రం వారికి అంతుబట్టడం లేదు. సతీష్ చంద్ర సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు శిబిరంలో కీలక అధికారిగా గుర్తింపు ఉంది. గతంలో వైఎస్సార్ హయంలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లిన ఆయన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంవోలో ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల జగన్ కి కూడా కొంత సన్నిహితంగా మెలుగుతున్నారు. దాంతో సీఎస్ కావాలనే ఆయన కోరికను జగన్ మన్నిస్తారా అనేది ఆసక్తిగా మారుతోంది. అయితే సతీష్ చంద్ర తీరుపై పలు సందర్భాల్లో రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. వైఎస్సార్సీపీ నేతలు కూడా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. దాంతో అది అంత సులువు కాదని భావిస్తున్నారు.
అదే సమయంలో సుదీర్ఘకాలంగా జగన్ కి సన్నిహితుడైన ఆదిత్యానాద్ దాస్ కూడా ఆశావాహంతో ఉన్నారు. సతీష్ చంద్ర 1986 బ్యాచ్ అధికారి కాగా, ఆదిత్యానాద్ దాస్ 1987 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన నీటివనరుల శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేస్తున్నారు. వారితో పాటుగా సీనియర్లలో 1985 బ్యాచ్ కి చెందిన ఏపీ క్యాడర్ అధికారులు ఆర్ సుబ్రహ్మణ్యం, సమీర్ శర్మ, అభయ్ త్రిపాఠీ వంటి వారు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వారిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా లేక ఏపీలో తనకు సన్నిహితంగా మెలిగే వారిని టీమ్ లో చేర్చుకుంటారా అన్నది చర్చకు దారితీస్తోంది.
కొత్త సీఎస్ విషయంలో జగన్ తీసుకోబోయే నిర్ణయం ప్రస్తుతం కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయ వ్యవహారాల్లో జగన్ ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాగాన్ని నడిపించాల్సిన సీఎస్ ఎవరు అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొస్తున్న తరుణంలో వాటిని నడిపేందుకు తగ్గట్టుగా ఎవరికి పట్టం కడతారో చూడాలి.